సాక్షిప్రతినిధి, వరంగల్: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా అభ్యర్థుల ఎంపికపై స్పష్టత రాలేదు. గెలుపు గుర్రాల జాబితా వడపోతలో తలమునకలైన ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఖరారుపై ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాల్లో అధికార పార్టీకి చెందిన నేతలే ‘సిట్టింగ్’లుగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పొత్తులపై ప్రతిష్టంభన కారణంగా కూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కిరాలేదు.
మరోవైపు బీజేపీ, వామపక్ష పార్టీలు సైతం అభ్యర్థులను బరిలో దింపే యోచన చేస్తుండగా... టీడీపీ వైఖరి బయటపడటం లేదు. ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా.. అదే రోజు నుంచి నామినేషన్ల పర్వం మొదలు కానుంది. ఇందుకు మరో నాలుగు రోజులే గడువే ఉండటంతో రాజకీయ పార్టీలు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తాయనేది చర్చనీయాంశంగా మారింది.
జోరు మీదున్న కారు..
అభ్యర్థుల ఎంపికపై టీఆర్‌ఎస్ అంతర్గతంగా కసరత్తును పూర్తి చేసినట్లుగా చెప్తున్నారు. అయితే అన్ని కోణాల్లో సర్వే చేస్తున్న ఆ పార్టీ అధిష్టానం ఈసారి సిట్టింగ్‌లకే అవకాశం ఇస్తుందా? లేక మార్పులు చేర్పులు చేస్తుందా? అన్న చర్చ జరుగుతోంది. ఓవైపు పసునూరి దయాకర్ ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి ఈసారి మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కడియం కావ్య పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే జనగామ ప్రాంతానికి చెందిన డాక్టర్ పగిడిపాటి సుగుణాకర్‌రాజుతో పాటు మాజీ ఎంపీపీ, సీనియర్ నాయకుడు రామగళ్ల పరమేశ్వర్ తదితరులు వరంగల్ టికెట్ కావాలని దరఖాస్తు చేసుకున్నారు.
మహబూబాబాద్ స్థానం నుంచి ప్రొఫెసర్ సీతారాంనాయక్ ఎంపీగా ఉండగా.. ఇక్కడినుంచి అవకాశం ఇస్తే పోటీ చేసేందుకు పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి రామచంద్రునాయక్, మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ ఒకరు సైతం టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చాలా చోట్ల ఇప్పటికే లోక్‌సభ అభ్యర్థుల పేర్లు పరోక్షంగా ప్రకటించినా.. వరంగల్, మహబూబాబాద్ స్థానాలపై తేల్చకపోవడం చర్చనీయాంశం కాగా, టీఆర్‌ఎస్ జాబితా వెల్లడిలో జాప్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. మహబూబాబాద్‌లో ఈ నెల 16న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్నాహక సమావేశం కూడా రద్దు చేశారు.
కాంగి‘రేసు’లో ఎవరో..?
కాంగ్రెస్ నుంచి వరంగల్, మహబూబాబాద్ స్థానాల కోసం 77 మంది టిక్కెట్ల కోసం దరఖాస్తు చేసుకోగా.. ఎవరికి ఆ టికెట్ దక్కుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలోనే వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల డీసీసీ అధ్యక్షుడిగా నాయిని రాజేందర్‌రెడ్డి, మహబూబాబాద్ జిల్లాకు భరత్‌చంద్రారెడ్డి, జనగామకు రాఘవరెడ్డిలను నియమించారు. ఈ కమిటీల ద్వారా వరంగల్ లోక్‌సభ స్థానం కోసం 34, మహబూబాబాద్ కోసం 43 మంది దరఖాస్తులను టీపీసీసీ ఎన్నికల కమిటీ పరిశీలన కోసం పంపించారు.
రాష్ట్రవ్యాప్తంగా 17 లోక్‌సభ స్థానాల అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు చేసిన ఎన్నికల కమిటీ వరంగల్ నుంచి నాలుగు, మహబూబాబాద్ నుంచి రెండు పేర్లను ఏఐసీసీకి పంపించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ప్రధానంగా వరంగల్ కోసం గత ఎన్నికల్లో ఓటమి చెందిన సర్వే సత్యనారాయణ, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, దొమ్మాటి సాంబయ్య, ఇందిర, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, మానవతారాయ్‌లతో పాటు 34 మంది దరఖాస్తు చేసుకున్నారు.
అలాగే మహబూబాబాద్ కోసం మాజీ ఎంపీ పోరిక బలరాంనాయక్, బెల్లయ్యనాయక్‌లతో పాటు 43 మంది దరఖాస్తులను టీపీసీసీ ఎన్నికల కమిటీ పరిశీలించినట్లు తెలిసింది. త్వరలోనే ప్రకటిస్తారని చెప్తున్నా.. ఎవరికి టికెట్ దక్కుతుందనేది సస్పెన్స్‌గా మారింది.
బీజేపీలో కనిపించని సందడి.. ‘దేశం’లో అస్పష్టత
కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసినా బీజేపీలో ఎన్నికల సందడి కనిపించడం లేదు. ఒకవైపు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి ఎంపీ టికెట్ల కోసం తమదైన శైలిలో ప్రయత్నాలు సాగుతుండగా బీజేపీలో మాత్రం స్తబ్దుగా ఉంది. గత లోక్‌సభ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఓటమి చెందారు. టీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ పోటీలో నిలబడే ఆశావహుల దగ్గరి నుంచి దరఖాస్తులను స్వీకరించింది. నోటిఫికేషన్ విడుదల కాగానే అభ్యర్థులను ప్రకటించేందుకు రెండు పార్టీలు సిద్ధమవుతుండగా బీజేపీ మాత్రం దరఖాస్తుల స్వీకరణ చేపట్టడం లేదని తెలుస్తోంది. ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమిగా కాంగ్రెస్, టీజేఎస్‌లతో కలిసి నడిచిన టీడీపీ ఈసారి పోటీ చేస్తుందా? లేదా? తెలియ డం లేదు.మునుపెన్నడూ లేనిరీతిలో టీడీపీలోనూ అభ్యర్థుల ఎంపికపై స్పష్టత రావడంలేదు. కాగా సీపీఐ, సీపీఎం పార్టీలు అభ్యర్థులను బరిలో దింపేందుకు కసరత్తు చేస్తున్నట్లు ప్రకటించాయి.
Comments
Please login to add a commentAdd a comment