హైదరాబాద్: ముస్లిం రిజర్వేషన్లతో బీసీలకు అన్యాయం జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. బీసీ హక్కులను హరిస్తున్న ప్రభుత్వంపై ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటామన్నారు. ఆదివారం ఆయన అసెంబ్లీ మిడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. రాజకీయ దురుద్దేశంతోనే ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్‌లను కలిపి బిల్లు పెట్టారు. రాజ్యాంగ హక్కుగా ఉన్న ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి సభను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ముస్లింలు వెనుకబడి ఉన్నారని అంటున్న కేసీఆర్ మరీ బీసీలకు ఎందుకు రిజర్వేషన్‌లు పెట్టలేదని మండిపడ్డారు. రిజర్వేషన్ల విషయం మేనిఫెస్టోలో చెప్పామంటున్న కేసీఆర్, దివ్యంగులకు ఇస్తామన్న 3శాతం సంగతి ఏంటని ప్రశ్నించారు. ఎంఐఎం ఎజెండాకు తలొగ్గి సభలో బీజేపీ గొంతు నొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.