సభలో మాట్లాడుతున్న సుభూహీ ఖాన్. చిత్రంలో లక్ష్మణ్, ఇతర బీజేపీ నేతలు
చార్మినార్/దూద్‌బౌలి: ఎవరికి ఇష్టమున్నా.. లేకున్నా.. దేశంలో సీఏఏ అమలు తప్పకుండా జరుగుతుందని పలువురు వక్తలు స్పష్టం చేశా రు. ఆర్టికల్ 11 ప్రకారం కేంద్రం చేసిన చట్టాన్ని దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా పాటించాల్సిన అవసరముందన్నారు. సీఏఏ చట్టాన్ని అమలు చేయని రాష్ట్రాలపై కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించా రు. కొన్ని రాజకీయ పార్టీల నాయకులు కావాల ని స్వార్థ రాజకీయ లబ్ధి కోసం ముస్లింలను తప్పుదారి పట్టిస్తున్నారని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు.
అఖండ భారత్ సంఘర్ష్ సమితి భాగ్యనగర్ కన్వీనర్ ఆలే భాస్కర్ రాజ్ ఆధ్వర్యంలో ఆదివారం కుడా స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ, నగర బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు, రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్‌రావు, సుప్రీంకోర్టు న్యాయవాది సుభూహీ ఖాన్ తదితరులు పాల్గొని సీఏఏ, ఎన్నార్సీ, ఎన్‌పీఆర్‌లపై ప్రజలకు అవగాహన కల్పించారు. భారత్ మాతాకీ జై.. మోదీ, అమిత్‌షా జిందాబాద్ అంటూ.. తిరంగా జెండాలు పట్టుకొని పెద్దఎత్తున నినాదాలు చేశారు.
ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్వార్థ రాజకీయ లబ్ధి కోసం ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు అన్నారు. ఆయనకు దమ్ము, ధైర్యం ఉంటే కుడాలో నిర్వహిస్తున్న ఈ సభకు రావాలని.. తామే దారుస్సలాంకు వచ్చి డిబేట్ నిర్వహిస్తామని సవాలు విసిరారు. గతంలో బంగ్లాదేశ్‌కు చెందిన తస్లీమా నస్రీన్ నగరానికి వచ్చి ప్రెస్‌క్లబ్‌లో సమావేశాన్ని నిర్వహిస్తే మజ్లీస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆమెపై విచక్షణారహితంగా దాడులు నిర్వహించారన్నారు.
దాడులు చేసిన మజ్లీస్ పార్టీ నాయకులపై ఇప్పటికైనా నగర పోలీసులు కేసులు నమోదు చేసి చార్జ్‌షీట్ వేయాల్సిన అవసరముందన్నారు. అసదుద్దీన్‌తో చేతులు కలిపిన సీఎం కేసీఆర్.. సీఏఏను తెలంగాణలో అమలు చేయబోమంటూ ప్రకటిస్తున్నారని, అవసరమైతే అసెంబ్లీలో ప్రకటన చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని వ్యతిరేకించడం సరైంది కాదని పేర్కొన్నారు. ఎన్నార్సీ, ఎన్పీఆర్‌ల సందర్భంగా ఇంటికి వచ్చే అధికారులు ఎలాంటి పత్రాలు అడగబోరని.. కేవలం 14 ప్రశ్నలకు జవాబులను మాత్రమే సేకరిస్తారన్నారు. కార్యక్రమంలో హిందూ సంఘటన్ అధ్యక్షుడు కరుణసాగర్, కార్పొరేటర్లు ఆలే లలిత నరేంద్ర, రేణు సోనీల, బీజేపీ నేతలు పాల్గొన్నారు.
సభకు హాజరైన ప్రజలు
Comments
Please login to add a commentAdd a comment