మాట్లాడుతున్న రఘునందన్‌రావు
సాక్షి, ఆదిలాబాద్ : గత 70 ఏళ్లు భారత దేశ చరిత్ర వక్రీకరణకు గరవుతోందనీ, కుహానా మేధావులు ఎందరో దీనికి కారణమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు విమర్శించారు. శనివారం ఆదిలాబాద్‌లో టీఎన్జీవో భవన్‌లో నిర్వహించిన ఆర్టికల్ 370 రద్దుపై చర్చాగోష్టి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.. ఆంగ్లేయుల కుటిల పన్నాగంతోనే భారతదేశం విభజనకు గరైందన్నారు. రాజా హరిసింగ్ పాలనలో ఉన్న కశ్మీర్ భూభాగాన్ని ఆక్రమించుకునే దుశ్చర్యకు పాక్ పాల్పడిందన్నారు. నాటి నెహ్రూ ప్రభుత్వం షేక్ అబ్దుల్లాకు అనుకూలంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. అబ్దుల్లాను అంబేద్కర్ వద్దకు పంపించి ఆర్టికల్ 370 ని రాజ్యాంగంలో చొప్పించే ప్రయత్నం చేయగా, అంబేద్కర్ ఆ ప్రతిపాదనను తిరస్కరించారని తెలియజేశారు. దాంతో రాజ్యాంగ నిర్మాణ కమిటీ సభ్యులైన గోపాలకృష్ణ అయ్యంగార్ ద్వారా వాళ్లు అనుకున్నది సాధించారని పేర్కొన్నారు. అయితే 370ని రద్దుచేసే అంశం కూడా అదే క్లాజ్‌లో ఉందని, దాని ద్వారానే నేడు రద్దు సాధ్యమైందని వివరించారు.
స్థానిక ప్రజల కోరిక మేరకే లడాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేశారన్నది గుర్తుంచుకోవాలన్నారు. అన్ని వర్గాల మేలుకోసం కశ్మీర్‌లో రిజర్వేషన్ల సవరణ, సమానత్వమే జనసంఘ్, బీజేపీల ముఖ్య లక్ష్యమని స్పష్టం చేశారు. జమ్ముకశ్మీర్‌లో తదుపరి ఎన్నికలు పీవోకేను కలుపుకునే జరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ సోయం బాపూరావు మాట్లాడుతూ.. 370 రద్దుతో ప్రజల్లో హర్షం, కాంగ్రెస్‌లో అసహనం మొదలయ్యాయన్నారు. కాంగ్రెస్ హయాంలో దేశంలో ఎన్నో ఉగ్రదాడులు జరిగాయి కానీ మోదీ ప్రధాని అయ్యాక అవి మచ్చుకైనా కానరావట్లేదన్నారు. ప్రజల ఆశీర్వాదంతోనే 370 ఆర్టికల్ రద్దుపై తనకు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనే అవకాశం దక్కిందని పేర్కొన్నారు. ట్రిపుల్ తలాఖ్ రద్దుతోనే ముస్లిం మహిళలకు నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసినిరెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి వేణుగోపాల్, పార్టీ పార్లమెంట్ కన్వీనర్ ఆదినాథ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment