
సాక్షి, జగిత్యాల: రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పులపాలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. సోమవారం ఆయన జగిత్యాల రూరల్‌లోని చల్‌గల్, పోరండ్ల పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో వరి ఎక్కువ పండుతుందని చెబుతున్నారని.. ఇదేం కొత్త కాదని.. ఆయన ముఖ్యమంత్రి పదవిలో లేనప్పుడు కూడా అంతే పండిందని వ్యాఖ్యానించారు. ఇందులో కేసీఆర్ చేసిందేమిలేదని రైతులు కష్టపడి పండిస్తున్నారని తెలిపారు. కేంద్రం నుంచి ఎలాంటి పరిమితులు లేవని.. ఎన్ని మెట్రిక్ టన్నులైన ఎఫ్‌సీఐ కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ నాయకులు రైతులను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు పండించిన ప్రతి వడ్లగింజని కేంద్రం కొనుగోలు చేసిందని చెప్పారు. తెలంగాణలోనే ప్రోక్యూర్మెంట్ అవుతుందని సీఎం కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.
గత ఏడాది ఒక్క పంజాబ్‌లోనే కోటి 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని భారత ఆహార సంస్థ( ఎఫ్‌సీఐ) కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. కరోనా సమయంలో రవాణా సౌకర్యం తక్కువ ఉందని, హమాలి కొరత ఉందని అన్నదాతల పొట్ట కొట్టడం బాధాకరమన్నారు. వలస కూలీల భోజన సౌకర్యం కోసం కేంద్రం రూ.599 కోట్లు మంజూరు చేసిందని..అది కూడా అమలు చేయడంలేదని.. కేవలం కార్డు లేనివారికి రూ.500 ఇచ్చి చేతులు దులుపుకున్నారని ధ్వజమెత్తారు. వలస కూలీల కోసం ఇచ్చిన నిధులు, కోవిడ్ ఆసుపత్రుల అభివృద్ధి కోసం ఇచ్చిన 15 వేల కోట్ల నిధులు నుంచి రూ.1500లను పంచుతున్నారని మండిపడ్డారు. వలస కూలీలను స్వస్థలాలకు చేర్చడానికి ట్రైన్ సదుపాయం కోసం కేంద్రం 85 శాతం భరిస్తే.. రాష్ట్ర ప్రభుతాన్ని 15 శాతం భరించమంటే ఇబ్బంది పడుతుందని ఆయన విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment