ఖర్చు పెట్టించి కాదంటావా? | blackmail in the name of love | Sakshi
Sakshi News home page

ఖర్చు పెట్టించి కాదంటావా?

Published Fri, Sep 1 2017 7:18 AM | Last Updated on Tue, Sep 4 2018 5:29 PM

ఖర్చు పెట్టించి కాదంటావా? - Sakshi

ఖర్చు పెట్టించి కాదంటావా?

► మాజీ ప్రియురాలితో గొడవకు దిగిన భగ్న ప్రేమికుడు  
► డబ్బులు ఇవ్వకపోతే ఫొటోలు బయటపడతానని బెదిరింపు 
► అతడికి కౌన్సెలింగ్, ఆమెకు భరోసా కల్పించిన సిటీ షీ–టీమ్స్‌ 
► ఓ ఇల్లాలికి ఇక్కట్లు తెచ్చిపెట్టిన సినీ హీరోపై అభిమానం
 
సాక్షి, సిటీబ్యూరో: ‘మనం కలిసి ఉన్నప్పుడు అంతా నేనే ఖర్చు పెట్టాను. ఆ మొత్తం దాదాపు రూ.5 లక్షల వరకు ఉంటుంది. డబ్బులు చెల్లించకపోతే నిన్ను అల్లరి పాలు చేస్తా’... తన మాజీ ప్రియురాలికి ఓ భగ్న ప్రేమికుడు ఇచ్చిన వార్నింగ్‌ ఇది. బాధితురాలు వాట్సాప్‌ ద్వారా ‘షీ–టీమ్స్‌’ను ఆశ్రయించడంతో అతడి బ్లాక్‌ మెయిలింగ్‌కు చెక్‌ పడింది. ఈ వ్యవహారంలో బాధ్యుడి అరెస్టు సాధ్యం కాకపోవడంతో బాధితురాలి వివాహం నేపథ్యంలో పోలీసులు అతనిపై మఫ్టీలో నిఘా ఉంచారు. రెండు వారాల క్రితం చోటు చేసుకున్న ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరానికి చెందిన ఓ యువతి, సికింద్రాబాద్‌కు చెందిన యువకుడు ఇంజినీరింగ్‌ కలిసి చదువుకున్నారు.

ఈ నేపథ్యంలో వీరికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి సన్నిహితంగా మెలిగారు. చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో ఖర్చంతా అతనే భరించాడు. అప్పట్లో వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు కొన్ని అతడి వద్ద ఉన్నాయి. అనివార్య కారణాలతో వీరిద్దరూ దూరం కాగా, సదరు యువతికి ఇటీవల వివాహం నిశ్చయమైంది. ఈ విషయం తెలుకున్న యువకుడు ఆమెపై కక్షకట్టి ‘బ్లాక్‌ మెయిలింగ్‌’కు దిగాడు. తామిద్దరం కలిసి తిరిగిన రోజుల్లో ఖర్చంతా తానే భరించానని, దాంతో పాటు బహుమతులూ ఇచ్చినందుకు దాదాపు రూ.5 లక్షలు ఖర్చయిందని లెక్కచెప్పాడు. ఆ మొత్తం తనకు చెల్లించకపోతే తామిద్దరం కలిసి దిగిన ఫొటోలు బయటపెట్టి పెళ్లి చెడగొడతానని బెదిరించాడు. అతగాడిని వదిలించుకోవాలని భావించిన యువతి ఓ సారి రూ.లక్ష ఖరీదు చేసే తన బంగారు గొలుసు, మరోసారి రూ.50 వేల నగదు ఇచ్చింది.

రెండు రోజుల్లో ఆమె వివాహం ఉందనగా అతగాడి బ్లాక్‌ మెయిలింగ్‌ తీవ్రం చేయడంతో బాధితురాలు వాట్సాప్‌ ద్వారా ‘షీ–టీమ్స్‌’కు ఫిర్యాదు చేసింది. ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా సికింద్రాబాద్‌లో ఉన్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారం తన ఇంట్లో తెలియదని, లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయిస్తే తనకు ఇబ్బందని ఆ యువతి పోలీసులకు చెప్పడంతో అతగాడికి కౌన్సిలింగ్‌ ఇచ్చిన ‘షీ–టీమ్స్‌’ విడిచిపెట్టాలని భావించాయి. అయితే బయటకు వెళ్లిన తర్వాత అతను వివాహం చెడగొట్టే ప్రమాదం ఉందని అధికారులు అనుమానించారు. అయితే లిఖిత పూర్వకంగా ఫిర్యాదు లేకుండా అరెస్టు చేయడానికి, తమ అదుపులో ఉంచుకోవడానికి ఆస్కారం లేకపోవడంతో యువతి వివాహమయ్యే వరకు అతడిపై నిఘా ఉంచాలని నిర్ణయించారు. కొందరు సిబ్బందిని మఫ్టీల్లో అతడి వెంటే ఉంచి కదలికలను నిశితంగా పర్యవేక్షించారు.  
 
‘అభిమానం’...అవస్థలు 
బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న ఓ వివాహితకు ఓ సినీ నటుడంటే ఎంతో అభిమానం. దీంతో ఫేస్‌బుక్‌లో ప్రొఫైల్‌ క్రియేట్‌ చేసుకున్న ఆమె సదరు హీరోను ‘ఫాలో’ అవుతుండేది. కొన్ని రోజులకు ఓ యువకుడి నుంచి ఆమెకు ఓ ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ రావడంతో ఆమోదించింది. తనకూ సదరు హీరో అంటే అభిమానమంటూ చాటింగ్‌ ప్రారంభించిన అతను ఆమెకు దగ్గరయ్యాడు. ఈ నేపథ్యంలో వివాహిత తన ఫొటోలు కొన్నింటికి అతడికి పంపింది. వీటి ఆధారంగా అతడు బ్లాక్‌ మెయిలింగ్‌కు దిగాడు. రెండు దఫాల్లో ఆమె నుంచి రూ.లక్ష వసూలు చేయడంతో పాటు అభ్యంతరకర ప్రతిపాదనలు చేశాడు. ఎట్టకేలకు విషయం ఆమె భర్తకు తెలిసింది. ఆయన ప్రొద్భలంతో బాధితురాలు వాట్సాప్‌ ద్వారా షీ–టీమ్స్‌కు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. లిఖిత పూర్వక ఫిర్యాదు చేయడానికి ఆమె నిరాకరిచడంతో యువకుడినికి కౌన్సిలింగ్‌ ఇచ్చి విడిచిపెట్టారు.
 
ఫేక్‌ ప్రొఫైల్‌ క్రియేట్‌ చేసి..
గోదావరిఖనిలోని స్వతంత్ర చౌక్‌ ప్రాంతానికి చెందిన ఎ.సందీప్‌ ప్రైవేట్‌ ఉద్యోగిగా పని చేసేవాడు. ఇతడికి గతంలో బంజారాహిల్స్‌ ప్రాంతానికి చెందిన ఓ యువతితో పరిచయం ఉండేది. కొన్నాళ్ళకు ఆ యువతి సందీప్‌తో తెగతెంపులు చేసుకుంది. దీంతో ఆమెపై కక్షకట్టిన సందీప్‌ ఆమెను వేధించడం ప్రారంభించాడు. అతడు పంపిస్తున్న సందేశాలకు ఆమె స్పందించకపోవడంతో విచక్షణ కోల్పోయిన అతను స్నేహితుల దినోత్సవం రోజు ఆ యువతి పని చేస్తున్న కార్యాలయానికి వెళ్లి దురుసుగా ప్రవర్తించాడు. ఈ అవమాన భారంతో ఆమె ఉద్యోగం మానుకుంది. యువతి కుటుంబీకులు సైతం సందీప్‌ను మందలించారు. అయినా తన వైఖఉరి మార్చుకోని అతగాడు ఫేస్‌బుక్‌లో ఆ యువతి వివరాలతో నకిలీ ప్రొఫైల్‌ క్రియేట్‌ చేసి కాల్‌గర్ల్‌గా పొందుపరిచాడు. దీంతో బాధితురాలు ‘షీ–టీమ్స్‌’ను ఆశ్రయించింది. నిందితుడిని పట్టుకున్న పోలీసులు బంజారాహిల్స్‌ ఠాణాలో కేసు నమోదు చేయించి గురువారం అరెస్టు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement