ఆకట్టుకున్న అంధుల కార్ ర్యాలీ
మాదాపూర్, న్యూస్‌లైన్: అంధుల చూపే మార్గంలో కారును నడిపే ప్రక్రియ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. బ్రెయిలీ లిపి బోర్డు ఆధారంగా కారు ర్యాలీ గమ్యస్థానానికి చేరుకోవడాన్ని అంతా ఆసక్తిగా తిలకించారు. ఆదివారం గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ వద్ద ఎయిర్‌సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంధుల కార్ ర్యాలీని సినీనటి మధుషాలిని ప్రారంభించారు. ఇందులో 50 కార్లు పాల్గొన్నాయి.
కారులో అంధునితోపాటు ఓ డ్రైవర్ ఉంటారు. అంధుడు కారు ముందు సీట్లో కూర్చోని బ్రెయిలీ పటం ద్వారా చేసే సూచనల మేరకు డ్రైవర్ కారును నడుపుతూ గమ్యస్థానానికి చేరుకోవడం ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం. సమయం, వేగం, దూరం పద్ధతి ద్వారా ఈ ర్యాలీ 50 కిలోమీటర్ల మేరకు ప్రయాణించనున్నట్లు, విజేతలకు బహుమతి ప్రదానం చేయనున్నట్టు ఎయిర్‌సెల్ రీజినల్ బిజినెస్ హెడ్ (సౌత్) హమీబక్షి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో భవన నిర్మాణాలు చేపట్టేందుకు అవసరమైన నిధుల సమీకరణకు కోసం ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు.
ఇలాంటి ప్రదర్శన చూడలేదు: మధుషాలిని
కంటి చూపు లేక ప్రపంచాన్ని చూడలేని వారు తమ ప్రతిభతో కారు ర్యాలీలో పాల్గొని గమ్యస్థానాన్ని చేరడం మరుపురాని అనుభూతిని కలిగించిందని సినీ నటి మధుషాలిని అన్నారు. అంధుల కారు ర్యాలీని తాను ఇప్పటివరకు చూడలేదన్నా రు. ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో అసవరమన్నారు.