అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ హరిత
వరంగల్ రూరల్: అన్ని దానాల్లో కంటే రక్తదానం గొప్పదని, మరొకరికి ప్రాణదానమని కలెక్టర్ ముండ్రాతి హరిత అన్నారు. సోమవారం రూరల్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరిత మాట్లాడుతూ వరంగల్ రెడ్ క్రాస్‌లో చికిత్స పొందుతున్న తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తం కొరత తీవ్రంగా ఉందని, జిల్లాలోని ఉద్యోగులతో ఒక రోజు రక్తదాన శిబిరం నిర్వహిస్తే బాగుంటుందని రెడ్ క్రాస్ వారి అభ్యర్థన మేరకు ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. సోమవారం ఉదయం 8గంటల నుంచే ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు అధిక సంఖ్య లో హాజరై రక్తదానం ఇవ్వడం ప్రారంభించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ రావుల మహేందర్‌రెడ్డి, డీఆర్‌డీఓ సంపత్‌రావు, రెడ్‌క్రాస్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ విజయ్‌చందర్‌రెడ్డి, వరంగల్ ఆర్డీఓ సీహెచ్.మహేందర్ జీ, పరకాల ఆర్డీఓ ఎల్.కిషన్, జిల్లా పంచాయతీ అ«ధికారి నారాయణరావు, జిల్లా ఉద్యాన వనశాఖ అధికారి శ్రీనివాసరావు, టీఎన్‌జీఓల సంఘం రూరల్ జిల్లా అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ హరిప్రసాద్ పాల్గొన్నారు. కలెక్టర్ ముండ్రాతి హరిత స్వయంగా రక్తదానం చేసి ఇతర ఉద్యోగులకు స్ఫూర్తిగా నిలిచారు. ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఉపాధి హమీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు, వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలు, గ్రామీణ అభివృద్ధి శాఖ సిబ్బంది రక్తదానం చేశారు.
డయేరియాపై విస్తృత ప్రచారం చేయాలి
డయేరియా పట్ల విస్తృత ప్రచారం చేపట్టాలని కలెక్టర్ ముండ్రాతి హరిత తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని చాంబర్‌లో ఐసీడీఎఫ్ జిల్లా సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల వైద్య, ఆరోగ్య సిబ్బంది, సంబంధిత శాఖలు గ్రామాల్లో ప్రచారం చేయాలని సూచించారు. డయేరియా తగలకుండా నియంత్రించడానికి జూన్ 10 నుంచి 22వ తేదీ వరకు విస్తృత ప్రచారం చేయాలని, దీని కోసం కార్యచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో ఉన్న వాటర్ ట్యాంకులను 15 రోజులకు ఒకసారి శుభ్రపరచాలని, క్లోరినేషన్ చేసిన తాగునీటిను ప్రజలకు అందించాలని, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బంది ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా పంచాయతీ అధికారికి కలెక్టర్ హరిత సూచించారు.అనంతరం రాష్ట్రీయ బాలస్వస్థ కార్యక్రమ అమలుతీరును అధికారులతో కలెక్టర్ హరిత సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, డిప్యూటీ డీఎంఅండ్ హెచ్ ఓ డాక్టర్ శ్యామ నీరజ, డాక్టర్ మహేంద్రన్, డీఈఈఎంఓ డాక్టర్ స్వరూపరాణి, అహల్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment