పైన బత్తాయి.. లోన ఎర్రచందనం | Border area the states of Tamil Nadu | Sakshi
Sakshi News home page

పైన బత్తాయి.. లోన ఎర్రచందనం

Published Fri, Sep 4 2015 12:59 AM | Last Updated on Tue, Aug 21 2018 9:06 PM

Border area the states of Tamil Nadu

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం నుంచి ఎర్రచందనం ఎంతో కాలంగాహైదరాబాద్‌కు అక్రమ రవాణా అవుతున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ అజ్ఞాత వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు తంగడపల్లి వద్ద మాటువేసి లారీని అదుపులోకి తీసుకున్నారు.  లారీ అడుగు భాగంలో ఎర్రచందనం దుంగలను ఉంచి, పైన బత్తాయి కాయల బస్తాలను వేసి, ఎవరికీ అనుమానం రాకుండా, రవాణా చేస్తున్నారు. గురువారం పట్టుబడ్డ లారీలో 44బస్తాల బత్తాయిలున్నాయి. ఎక్కడ లారీని ఆపినా, ఎవరికీ అనుమానం రాదు. చూడడానికి బత్తాయిల లోడు లాగే ఉంటుంది. ఈ బత్తాయి కాయలు కూడా అమ్మడానికి పనికొచ్చేవి కావు. బత్తాయి గ్రేడింగ్‌లో తీసేసే కాయలను బస్తాల్లో నింపి, ఇలా ఎర్ర చందనం అక్రమ రవాణాకు వినియోగిస్తున్నారు.
 
 డ్రైవర్లకు తెలియకుండానే..
 ఎర్రచందనంను హైదరాబాద్‌కు అక్రమంగా రవాణా చేస్తున్న స్మగ్లర్లకు, డ్రైవర్లకు ఎలాంటి సంబంధం ఉండదు. అక్రమంగా ఎర్రచందనం రవాణా అవుతుందన్న విషయం కూడా డ్రైవర్లకు తెలియదు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎర్రచందనంను లారీల్లో ఎత్తిన స్మగ్లర్లు, ఓ ట్రాన్స్‌పోర్టు సహకారంతో లారీని అక్కడి నుంచి ఓ చోటకు తరలిస్తారు. ట్రాన్స్‌పోర్టు వద్ద అందుబాటులో ఉన్న డ్రైవర్‌ను ఈ లారీని హైదరాబాద్‌కు తీసుకెళ్లమని,అక్కడ వారే లోడును దించుకుంటారని పంపిస్తారు. ట్రాన్స్‌పోర్టుకు సంబంధించి ఎలాంటి పత్రాలు కూడా ఇవ్వరు. గురువారం పట్టుబడ్డ తమిళనాడు రాష్ట్రం తూతుకుడి జిల్లా కోయల్‌పట్టి గ్రామానికి చెందిన దురైసింగం(70)ఢది కూడా అదే పరిస్థితి.
 
  ఏలూరు వరకు స్మగ్లర్లు ట్రాన్స్‌పోర్టు సహకారంతో లారీని తెచ్చారు. అక్కడ ఈయనను లారీ ఎక్కించి హైదరాబాద్‌కు తీసుకెళ్లమని చెప్పారు. ఈయన హైదరాబాద్‌కు సురక్షితంగా చేరి, లారీని ఆపి వారికి ఫోన్ చేస్తే, వారే లోడును దించుకోవాల్సిన వారికి సమాచారమిస్తారు. వారు వచ్చి లోడును దించుకొని వెళ్లిపోతారు. ఇలా డ్రైవర్లకు ఇక్కడ లోడు చేసిందెవరో, అక్కడ దించుకునే వారెవరో సమాచారం తెలియదు. ఒకవేళ పోలీసులకు పట్టుబడ్డా వీరి వివరాలు బయటికి రావు. పట్టుబడ్డ లారీ తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ మహిళ పేరున ఉంది. లోతైన దర్యాప్తు ద్వారా అన్ని విషయాలను వెలుగులోకి తెస్తామని చౌటుప్పల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ భూపతి గట్టుమల్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement