మాకూ ఓ జగన్ కావాలి!
పంపాన వరప్రసాదరావు, వడ్డే బాలశేఖర్ – ఏపీ, తమిళనాడు సరిహద్దు గ్రామాల నుంచి సాక్షి ప్రతినిధులు: పక్క పక్కనే ఉన్న సరిహద్దు గ్రామాల్లో ఎంత తేడా! కూత వేటు దూరంలోని పల్లెలో ప్రతి గడపనూ సంక్షేమం పలకరిస్తుండగా ఆ అదృష్టం తమకు దక్కలేదని ‘తంబి’ నిట్టూరుస్తున్నాడు!! మిట్టపాళెం (ఆంధ్రప్రదేశ్), పున్నియం (తమిళనాడు) గ్రామాలు కలిసే ఉంటాయి కానీ వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్నందున ప్రజల జీవన ప్రమాణాలు, పొందుతున్న పౌరసేవల్లో ఎంతో వ్యత్యాసం ఉంది.
రైతులను ఆదుకోవడం నుంచి ఆరోగ్య సేవల వరకు..పింఛన్ల నుంచి మహిళా సాధికారత వరకు.. చదువుల నుంచి పౌరసేవల దాకా ప్రతి విషయంలోనూ మన సరిహద్దు గ్రామం మిట్టపాళెంను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు వరుసలో నిలబెట్టింది. చెంతనే ఉన్న పల్లెలు కావడంతో ఆ తేడా కళ్లకు కట్టినట్లు స్పష్టంగా తెలిసిపోతోంది. తమ పొరుగు గ్రామంలోని ప్రజలకు అందుతున్న సంక్షేమం, పౌరసేవలను చూసి ఆశ్చర్యానికి గురవుతున్న తమిళనాడు వాసులు తమకూ జగన్ లాంటి నాయకుడు ఉంటే బాగుండని కోరుకుంటున్నారు. ఏపీ – తమిళనాడు సరిహద్దు గ్రామాలను సందర్శించిన ‘సాక్షి’ ప్రతినిధుల బృందం మిట్టపాళెం, పున్నియం వాసులను పలుకరించి క్షేత్ర స్థాయి పరిస్థితులను పరిశీలించింది.
అక్కడ తాళం కప్ప.. ఇక్కడ అడిగిందే తడవు
తమిళనాడులోని సరిహద్దు గ్రామం పున్నియం పంచాయతీ కార్యాలయానికి వెళ్లగా తాళం వేసి ఉంది. కార్యదర్శి కాదు కదా కనీసం అటెండర్ కూడా అక్కడే లేరు. ఎందుకిలా? అని గ్రామస్తులను ఆరా తీయగా కార్యాలయానికి అధికారులు రోజూ రారని సమాధానమిచ్చారు. నెలలో కొద్ది రోజులు మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉంటారని, ఏ పని కావాలన్నా 13 కి.మీ. దూరంలో ఉన్న పళ్లిపట్టులోని బ్లాక్ కార్యాలయానికి వెళ్లాల్సిందేనని చెప్పారు. ఒకటికి పది సార్లు తిరిగితే కానీ చిన్న పని కూడా జరగదని పున్నియం గ్రామస్తుడు ఆర్.కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు.
పక్కనే ఉన్న మిట్టపాళెంలో ఒకే ప్రాంగణంలో ఏర్పాటైన గ్రామ సచివాలయంతో పాటు రైతు భరోసా కేంద్రం, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లు ప్రజలకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నాయి. అయితే నాలుగేళ్ల క్రితం వరకు వీరు కూడా ఏ పని కావాలన్నా 15 కి.మీ. దూరంలో ఉన్న మండల కేంద్రం నగరి వెళ్లేవారు. నాడు చెప్పులరిగేలా తిరిగినా పనులు జరగని దుస్థితి. ఇప్పుడు గ్రామంలోనే సచివాలయం, ఆర్బీకేల రాకతో వలంటీర్ల ద్వారా గడప వద్దే సేవలన్నీ పొందగలుగుతున్నారు. ఇటీవలే జగనన్న సురక్ష క్యాంపైన్ ద్వారా పైసా ఖర్చు లేకుండా ఏకంగా 456 సేవలు పొందగలిగారు. కుల, ఆదాయ, జనన, మరణ ద్రువీకరణ పత్రాలే కాకుండా వన్ బీ, అడంగల్, మ్యుటేషన్ లాంటి అన్ని రకాల పౌరసేవలను ఎలాంటి వ్యయ ప్రయాసలకు గురికాకుండా పొందగలుగుతున్నారు.
ఆరోగ్యం ఆమడ దూరం.. ఇక్కడ ఇంటికే డాక్టర్
ప్రజారోగ్య పరిరక్షణ విషయానికి వస్తే 6 వేల మంది జనాభాకు ఒకటి చొప్పున పున్నియం గ్రామంలో ఒక సబ్‌సెంటర్ ఉంది. ఒక ఎంఎల్‌హెచ్‌పీ (మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్) అందుబాటులో ఉంటూ బీపీ, షుగర్ లాంటి సాధారణ పరీక్షలు చేసి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు మందు బిళ్లలు ఇస్తున్నారు. డెంగీ, మలేరియా, వివిధ వ్యాధుల నిర్ధారణకు ర్యాపిడ్ టెస్ట్‌లు అందుబాటులో లేవు. టెలీ మెడిసిన్ సౌకర్యం లేదు. వైద్యుడి సేవలు పొందాలంటే 13 కి.మీ పైగా దూరంలో ఉండే స్వర్గపేట ప్రభుత్వాస్పతికి వెళ్లాల్సిందే. అదే ఏపీలో 2 వేలకు పైగా జనాభా ఉన్న మిట్టపాళెం పంచాయతీలో ప్రభుత్వం వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ను ఏర్పాటు చేసింది.
క్లినిక్‌లో బీఎస్సీ నర్సింగ్ విద్యార్హత కలిగిన ఎంఎల్‌హెచ్‌పీ, ఒక ఏఎన్ఎంతో పాటు ఆశావర్కర్ ఉన్నారు. ఈ క్లినిక్‌లో 105 రకాల మందులు, 14 వైద్య పరీక్షలు, టెలీమెడిసిన్ సౌకర్యం ఉంది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా బుగ్గ అగ్రహారం పీహెచ్సీ వైద్యుడు నెలకు రెండు సార్లు మిట్టపాళెం గ్రామాన్ని సందర్శిస్తున్నారు. రోజంతా గ్రామంలోనే ఉంటున్నారు. బీపీ, షుగర్ బాధితులు, గర్భిణులు, పిల్లలు, వృద్ధుల ఆరోగ్యాలపై ఆరా తీసి అవసరమైన వైద్య సేవలందిస్తున్నారు. మంచానికే పరిమితమైన అనారోగ్య బాధితుల ఇళ్ల వద్దకే వెళ్లి వైద్యం చేస్తున్నారు. టెలిమెడిసిన్ ద్వారా స్పెషలిస్ట్ వైద్యుల కన్సల్టేషన్ సేవలు సైతం ఇక్కడ అందుబాటులోకి ఉన్నాయి. మిట్టపాళెం ప్రజలు నాణ్యమైన మెరుగైన వైద్యం కోసం వ్యయ ప్రయాసలకోర్చే పరిస్థితులు లేవు.
► తమిళనాడులోని సరిహద్దు గ్రామం పున్నియం పంచాయతీ పరిధిలో సామాజిక పింఛన్లతో పాటు ఇటీవలే ప్రారంభించిన కుటుంబానికి ఓ మహిళకు రూ.వెయ్యి ఆర్ధిక సాయం మినహా మరే పథకం ద్వారా సాయం అందడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు.
► ఏపీలోని మిట్టపాళెం పంచాయతీ పరిధిలో మిట్టపాళెంతో పాటు మిట్టపాళెం ఏఏడబ్ల్యూ (ఆది ఆంధ్రా వాడ), చిన్నతంగల్, మేలపట్టు, మేలపట్టు హెచ్‌డబ్ల్యూ (హరిజనవాడ) గ్రామాలుండగా 2,452 జనాభా నివసిస్తోంది. 930 కుటుంబాలున్నాయి. తమిళనాడులోని పున్నియం పంచాయతీ పరిధిలో పున్నియంతో పాటు నల్లవన్నెంపేట, పున్నియం కాలనీ గ్రామాల్లో 1,850 జనాభా, 450 కుటుంబాలున్నాయి.
వాళ్ల మాదిరిగా పేదలమే అయినా..
మేకల పెంపకంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. రెక్కలు ముక్కలు చేసుకుంటే కానీ నాలుగేళ్లు నోటికెళ్లవు. రేషన్ సరుకులు మినహా ప్రభుత్వ పరంగా మాకెలాంటి సాయం అందడం లేదు. ఈ మధ్యే కుటుంబంలో మహిళకు రూ.1,000 ఇస్తున్నారు. అదీ కూడా అందరికి అందడం లేదు. అదే మిట్టపాళెం వాసులకు అక్కడి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తోంది. కుటుంబంలో ప్రతీ ఒక్కరూ లబ్ధి పొందుతున్నారు. వాళ్ల మాదిరిగానే మేము పేదవాళ్లమే. అలాంటి సంక్షేమ పథకాలను మా ప్రభుత్వం కూడా ప్రవేశపెడితే బాగుంటుంది.
–మణియమ్మ,, నల్లవెన్నంపేట, పున్నియం పంచాయతీ
ప్రతి గడపకూ సాయం
నాకు 3 ఎకరాల పొలం ఉంది. వరి, పూల తోటను సాగు చేస్తా. వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 పెట్టుబడి సాయం అందుతోంది. నాకు రూ.2,750 చొప్పున ప్రతి నెలా పింఛన్ వస్తోంది. నా భార్య జగదాకు చేయూత కింద ఏటా రూ.18,750 ఇస్తున్నారు. ఆసరా రూపంలో ఏటా రూ.10 వేలు జమ చేశారు. నా పెద్ద కుమారుడు మురుగన్‌కు ఇంటి రుణం ఇచ్చారు. కోడలికి అమ్మఒడి, ఆసరా వస్తోంది. గతంలో పథకాలు అందడం అటుంచి ఎలా దరఖాస్తు చేయాలో కూడా తెలిసేది కాదు. ఇప్పుడు వలంటీర్లు ఇంటికొచ్చి వివరించి దగ్గరుండి మరీ దరఖాస్తు చేయిస్తున్నారు. ప్రతి గడపకూ సాయం అందుతోంది’.
–బాలం రాజలింగం, చిన్నతంగల్, మిట్టపాళెం పంచాయతీ
గౌరవంగా చూస్తున్నారు
ఏ నెలలో ఏ సంక్షేమ పథకం ఇస్తారో, ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇంటింటికి వెళ్లి తెలియజేస్తున్నాం. సొంత బిడ్డలా ఆదరిస్తున్నారు. అమ్మ ఒడి, ఆసరా పథకాల ద్వారా నేను కూడా లబ్ధి పొందా. ఆటో నడిపే నా భర్తకు వాహన మిత్ర వస్తోంది. మా అత్తకు చేయూత, ఆసరా, ఇళ్ల స్థలం వచ్చింది’
–జి.విజయలక్ష్మి, వలంటీర్, చిన్నతంగలి గ్రామం, మిట్టపాళెం పంచాయతీ
మారుమూల పల్లెలకు వరం
గతంలో పంచాయతీ కార్యదర్శి వారానికో పది రోజులకో ఒకసారి గ్రామానికి వచ్చి కొద్దిసేపు కూర్చొని వెళ్లిపోయేవారు. ఎప్పుడొచ్చేది కూడా ప్రజలకు తెలిసేది కాదు. ఏ పని కావాలన్నా నగరి వెళ్లాల్సిందే. రాజకీయ నేతల సిఫారసులు, చేతులు తడపనిదే పనులయ్యేవి కావు. ఇప్పుడు సచివాలయం వచ్చిన తర్వాత ఏ ఒక్కరూ పొలిమేర కూడా దాటడం లేదు. ఎలాంటి సిఫార్సులు, పైసా ఖర్చు లేకుండా పౌరసేవలు అందుతున్నాయి. వలంటీర్ ద్వారా దరఖాస్తు చేసుకుని సంక్షేమ ఫలాలను పొందుతున్నారు. సచివాలయాలు వలంటీర్ వ్యవస్థలు మారుమూల పల్లెలకు నిజంగా ఓ వరం.
–గురువా వినోద్‌కుమార్, మిట్టపాళెం సచివాలయ కన్వీనర్
ఏపీ స్థానికత పొందాలనిపిస్తోంది..
ఈ ఫోటోలో కనిపిస్తున్న ఎన్.మురుగన్ తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పళ్లిపట్టు బ్లాక్ పరిధిలోని పున్నియం దళితవాడ నివాసి. మన రాష్ట్ర సరిహద్దులోని చిత్తూరు జిల్లా నగరి మండలం మిట్టపాళెం పక్కనే ఆ ఊరు ఉంటుంది. రైతు కూలీ, దివ్యాంగుడైన మురుగన్ రూ.1,200 పింఛన్ అందుకుంటుండగా ఇటీవలే రూ.1,500కి పెరిగింది. బ్యాంక్ ఖాతాలో జమ అయ్యే పెన్షన్ డబ్బుల కోసం రోజూ ఎదురు చూడాల్సిందే. నెలలో ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. మురుగన్ కుటుంబానికి సొంతంగా ఇల్లు కానీ ఇంటి స్థలంగానీ లేదు.
గ్రామంలో ఎంతో మందిది ఇదే పరిస్థితి.పక్క గ్రామంలో తమలాంటి నిరుపేద కుటుంబాలకు సీఎం జగన్ అండగా నిలుస్తుండటాన్ని చూసినప్పుడు తమ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే తరహాలో సంక్షేమ పథకాలను అమలు చేస్తే బాగుంటుందని మురుగన్ కోరుకుంటున్నాడు. ‘వికలాంగులకు ఏపీలో రూ.3 వేలు పెన్షన్ ఇస్తున్నారు. మాకు రూ.1,500 మాత్రమే వస్తోంది. ఆ పెన్షన్ సొమ్ము తీసుకోవడానికి కూడా పడిగాపులు కాయాలి. ఇవన్నీ చూసినప్పుడు పక్కనే ఉన్న సరిహద్దు గ్రామంలోకి వెళ్లి ఏపీ స్థానికత పొందాలనిపిస్తోందని చెబుతున్నాడు.
చిత్తూరు జిల్లా మిట్టపాళెంలో నిర్మించిన సచివాలయం, వైఎస్సార్ హెల్త్ క్లినిక్, ఆర్బీకే భవనాలు
సుబ్రహ్మణ్యం సంబరం..!
చిత్తూరు జిల్లా నగరి మండలం మిట్టపాళెం వాసి డి.సుబ్రహ్మణ్యం నిరుపేద వర్గానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు. వైఎస్సార్ పెన్షన్ కానుక కింద రూ.2,750 వృద్ధాప్య పింఛన్ పొందుతున్నాడు. ప్రతి నెలా ఒకటో తేదీ ఉదయాన్నే వలంటీర్ ఇంటికొచ్చి పింఛన్ ఇస్తున్నాడు. కొద్దిపాటి వ్యవసాయ భూమి ఉండడంతో ఏటా వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.13,500 పెట్టుబడి సాయం వస్తోంది. ఆయన భార్య హంసకు వైఎస్సార్ చేయూత కింద ఏటా రూ.18,750 చొప్పున జమ అవుతోంది.
ఆయన ఇద్దరు పిల్లలకు పక్కా గృహ యోగాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. పెద్ద కుమారుడికి భార్య పేరుతో వీకేఆర్ పురం లేఅవుట్లో రూ.3 లక్షల ఖరీదైన స్థలం, ఇంటి నిర్మాణానికి సాయం అందింది. రెండో కుమారుడికి సొంత స్థలంలో ఇంటి నిర్మాణ బిల్లును ప్రభుత్వం మంజూరు చేసింది. ‘నాకు వైఎస్సార్ హయాంలో మంజూరైన పింఛన్‌ను టీడీపీ ప్రభుత్వంలో తీసేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక పింఛన్ పెంచడమే కాకుండా గతంలో ఎప్పుడూ మా కుటుంబం ఇంత లబ్ధి పొందలేదు’ అని సుబ్రహ్మణ్యం సంతోషంగా చెబుతున్నాడు.
కూతవేటు దూరంలో ఎంత తేడా!
తమిళనాడులోని సరిహద్దు గ్రామం పున్నియంలో నివసించే మల్లీశ్వరి చిన్నకారు మహిళా రైతు. ఎరువులు, విత్తనాలు కొనాలంటే ఎన్నో అగచాట్లు పడాలి. ఏది కావాలన్నా 13 కి.మీ.దూరంలోని పళ్లిపట్టుకు వెళ్లాల్సిందే. పీఎం కిసాన్ కింద కేంద్రం ఏటా మూడు విడతల్లో ఇచ్చే రూ.6 వేల సాయం మినహా అక్కడి రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఆమెకు ఎలాంటి పెట్టుబడి సాయం అందదు. ఆ పక్కనే కూతవేటు దూరంలోని మిట్టపాళెం వాసులకు మాత్రం ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు రైతు ముంగిటికే అందుతున్నాయి. ఏటా రైతు భరోసా కింద రూ.13,500 పెట్టుబడి సాయం అందుతోంది.
రైతులు గిట్టుబాటు ధరలకు పంటలను విక్రయించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తోడుగా నిలుస్తోంది. ఉచిత బీమా, విపత్తులతో నష్టపోతే నష్ట పరిహారాన్ని అందిస్తోంది. ఇవేకాకుండా మహిళలకు ఎన్నో సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. ‘మిట్టపాళెంలో ఉన్న మా బంధువులకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి వింటుంటే సంతోషమనిపిస్తుంది. జగన్ పాలన చూస్తుంటే ఒక్కోసారి ఆంధ్రాలో పుట్టి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. కాసింత అసూయగానే ఉన్నా పొలం పుట్రా, పిల్లా పాపలను వదిలి వెళ్లలేం కదా’ అని మల్లీశ్వరి అంటోంది.
అమ్మ తరపు బంధువుల్లో ఆశ్చర్యం..
నిరుపేద రైతు కుటుంబానికి చెందిన టీకే తమిళసెల్వి మన రాష్ట్రంలోని సరిహద్దు గ్రామం మిట్టపాళెం నివాసి. నలుగురు సంతానం. వైఎస్సార్ చేయూత కింద ఏటా రూ.18,750 తమిళసెల్వి బ్యాంక్ ఖాతాలో జమ అవుతున్నాయి. డిగ్రీ చదువుతున్న ఆమె కుమారుడికి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన అందుతున్నాయి. ఆమె భర్త వెంకటేష్‌కు రెండేళ్ల క్రితం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా రూపాయి ఖర్చు లేకుండా ౖబైపాస్ సర్జరీ జరిగింది. ఏడాది పాటు మందులు ఉచితంగా ఇచ్చారు.
ఆమె కుటుంబానికి వైఎస్సార్ రైతు భరోసా కింద ప్రభుత్వం ఏటా రూ.13,500 ఇస్తోంది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను ఆర్బీకేలోనే తీసుకుంటున్నారు. ‘మా కుటుంబంలో ప్రతి ఒక్కరికి సీఎం జగన్ ప్రభుత్వంలో లబ్ధి చేకూరింది. మా అమ్మ తరపు బంధువులంతా తమిళనాడులోనే ఉన్నారు. మాకు ప్రభుత్వం చేకూర్చిన లబ్ధి గురించి చెబుతుంటే ఆశ్చర్యపోతున్నారు. తమ పిల్లలకు ఆంధ్రాలో పెళ్లి సంబంధాలు చూడాలని కోరుతున్నారు’ అని తమిళ సెల్వి చెబుతోంది.