నడిరోడ్డుపై దారుణహత్య
- దారికాచి తరిమితరిమి కత్తులతో నరికిన దుండగులు
- పాత కక్షల నేపథ్యంగా అనుమానం
తడ (సూళ్లూరుపేట) : జాతీయ రహదారిపై ఆంధ్రా, తమిళనాడు సరి హద్దు గ్రామం పన్నంగాడులో దుండగులు పట్టపగలు దారికాచి ఓ వ్యక్తిని కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. తమిళనాడు సరిహద్దుల్లోని ఎళాఊరు పరిధి తురాపాళెం గ్రామానికి చెందిన జీ పన్నీర్ సెల్వం (32) గుమ్మిడిపూండి ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేస్తున్నాడు. ప్రతి శనివారం అతను పన్నంగాడు ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చి వెళ్తుంటాడు. ఈ క్రమంలో శనివారం తన భార్య రాజితో కలసి ఉదయం 9.30 గంటల సమయంలో బైక్‌పై పన్నంగాడు ఆంజనేయస్వామిని దర్శించుకుని తిరిగి వెళ్తున్నాడు.
తమిళనాడు పరిధిలో నిర్మిస్తున్న మోడల్ చెక్‌పోస్టుకు 30 మీటర్ల దూరంలో జాతీయ రహదారిపై రెండు పల్సర్ బైక్‌లపై ఆరుగురు దుండగులు కాపు కాచి ఉన్నారు. పన్నీర్ సెల్వం బైక్‌కి తమ బైక్‌లు అడ్డు పెట్టి బైక్‌ను కాలితో తన్నడంతో భార్యాభర్తలు బైక్‌తో పాటు కింద పడిపోయారు. ప్రమాదాన్ని గ్రహిం చిన పన్నీర్ సెల్వం కింద పడిన భార్యను పైకిలేపి పారిపోవాల్సిందిగా చెబుతూ తను రోడ్డు దాటి పడమర వైపున ఉన్న చెరియన్ ఆసుపత్రి వైపు పరిగెత్తాడు. దుండగులు అతన్ని వెంబడించి వెనుక నుంచి మెడపై కత్తులతో నరికారు. తల వెనుక భాగంలో కసిదీరా నరకడంతో పన్నీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. నిర్ధారించుకున్న దుండగులు వెనుకనే కేకలు వేస్తూ వస్తున్న భార్యను వదిలి తమ బైక్‌లపై పరారీ అయ్యారు.
పాత కక్షలే కారణమా?
హతుడి భార్య దుండగులకు సంబం ధించిన సమాచారాన్ని పోలీసులకు అందించింది. 2015లో స్థల వివాదంలో నెలకొన్న కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉండొచ్చునని హతుడి బంధువులు చెబుతున్నారు. ఈ నెల 21న గుమ్మిడిపూండిలో దినకుమార్ అనే ఎర్రచందనం స్మగ్లర్ హత్య జరిగింది. దినకుమార్ గతంలో ఆంధ్రా సరిహద్దుల్లో కార్లు చోరీ చేసే కేసులో జైలుకెళ్లి బెయిలుపై తిరుగుతున్నాడు. ఇతని హత్య వెనుక పన్నీర్ హస్తం ఉండొచ్చునన్న అనుమానంతో దుండగులు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని మరో కోణంలో విచారిస్తున్నారు.
రెండు రాష్ట్రాల పోలీస్ అధికారుల పరిశీలన
హత్యోదంతంపై ఆరంబాకం పోలీసులకు సమాచారం అందించింది. పది రోజుల వ్యవధిలో గుమ్మిడిపూండి ప్రాంతంలో ఇది మూడో హత్య కావడంతో తిరువళ్లూరు ఎస్పీ శాంతన్‌తో హుటావుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఉన్న గుమ్మిపూండి డీఎస్పీ, సీఐలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సమాచారం అందుకున్న సూళ్లూరుపేట సీఐ విజయకృష్ణ, తడ ఎస్‌ఐ సురేష్‌బాబు సంఘటనా స్థలానికి చేరుకుని తడ తహసీల్దార్‌కి సమాచారం అందించారు. ఆయన వచ్చి ఇది ఆంధ్రా హద్దుగా తేల్చడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.