రామగుండం నగరపాలక సంస్థ అధికారులు కొత్తపుంతలు తొక్కుతున్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంకు కోసం బ్రాండ్ అంబాసిడర్లను నియమించారు. స్వచ్ఛతపై విస్తృత ప్రచారం కల్పించి మెరుగైన ర్యాంకు సాధించాలని పట్టుతో ముందుకెళ్తున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ, స్వచ్ఛ భారత్ మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ‘స్వచ్ఛ సర్వేక్షన్–2018’ పేరుతో సర్వే నిర్వహిస్తోంది. 4,000 మార్కులు ఉండే ఈ సర్వే వచ్చే ఏడాది జనవరి 4 నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభం కానుంది.
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలను పరిశుభ్రతలో భాగస్వామ్యం చేయడం కోసం స్వచ్ఛ సర్వేక్షన్ అంబాసిడర్లుగా బసంత్‌నగర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి, రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్, నటులు సాగర్, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి, యాంకర్, రేడియోజాకీ కత్తికార్తిక, కూచిపూడి డ్యాన్సర్ గుమ్మడి ఉజ్వలను నియమించారు. వీరితోపాటు ఎన్టీపీసీ సంస్థ ఈడీ డీకే దూబే, సింగరేణి సంస్థ డెప్యూటీ సూపరింటెండెంట్ యార్లగడ్డ పోలీస్, అడ్డగుంటపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజనర్సు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్ ప్రశాంతి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించనున్నారు.
‘మోదీ’ మెప్పుపొందిన నరహరి..
బసంత్‌నగర్‌కు చెందిన 2001 బ్యాచ్ ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి, ప్రస్తుతం మధ్యప్రదేశ్ క్యాడర్‌లో పనిచేస్తున్నారు. ఇండోర్ కలెక్టర్‌గా పనిచేసిన ఆయన దేశంలో జరిగినస్మార్ట్ సిటీ పోటీల్లో ఇండోర్‌కు మొదటి ర్యాంకు తీసుకువచ్చారు. ప్రధానమంత్రి మోదీ నుంచి నరహరి ప్రత్యేక ప్రశంసలు పొందారు. సేవలకు అబ్బురపడిన మధ్యప్రదేశ్ సర్కారు, నరహరిని రెవెన్యూ కార్యదర్శిగా నియమించింది.
సామాజిక సేవకుడు విక్రమ్‌జిత్ దుగ్గల్..
రామగుండం పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న విక్రమ్‌జిత్ దుగ్గల్ సామాజిక సేవలో తనదైన ముద్ర వేసుకున్నారు. అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ పలువురి మన్ననలు అందుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా తిర్యాణి మండలం గుండాల మారుమూల గిరిజన పల్లెలకు బయటి ప్రపంచాన్ని పరిచయం చేసిన ఐపీఎస్ ఆఫీసర్‌గా వారి హృదయాలు దోచుకున్నారు. గ్రామానికి రోడ్డు వేయించిన విక్రమ్‌జిత్ వారికి భాగ్యనగర్ అందాలు చూపించారు.
కమిషనర్‌కు పుష్పగుచ్చం అందజేత..
మధ్యప్రదేశ్ రెవెన్యూ కార్యదర్శి పరికిపండ్ల నరహరిని రామగుండం బల్దియా స్వచ్ఛ సర్వేక్షన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేయడంపట్ల, ఆలయ ఫౌండేషన్ సభ్యులు ఐత మోహన్‌రెడ్డి, బల్క రామస్వామి, పరికిపండ్ల రాము, ఐత శివకుమార్, చెర్ల దీక్షిత్, ఐత దేవేందర్ తదితరులు గురువారం రాత్రి మున్సిపల్ కమిషనర్ బోనగిరి శ్రీనివాసరావుకు పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. రామగుండంను నూటికి నూరు శాతం బహిరంగ మలవిసర్జన రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడానికి ఆలయ ఫౌండేషన్ సహకారాన్ని అందిస్తుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment