బ్రేవ్! | Brave! | Sakshi
Sakshi News home page

బ్రేవ్!

Published Fri, Jul 17 2015 1:16 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

బ్రేవ్! - Sakshi

బ్రేవ్!

అప్పుడప్పుడు ఓ గుడ్డు.. నెలలో ఓసారి అరటిపండు.. పాల కోటాలో కోతలు.. పక్కదారి పడుతున్న బియ్యం, నూనె, పప్పు దినుసులు.. ఇదీ కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో అమలు చేస్తున్న మెనూ తీరు.. పాఠశాలల్లో రోజువారీ నిర్వహణ వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాల్సి ఉండగా.. విద్యార్థినుల చేత లెక్కలు రాయించి.. నెల చివర్లో వారికి అనుకూలంగా చిట్టా తయారు చేసుకుని అందినకాడికి దండుకుంటున్నారు.. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతోంది.
 
 ‘కస్తూర్బా’ల్లో  వంట సరుకులు పక్కదారి

  కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా ‘వంట’ దినుసుల నిధులను ఒంటబట్టించుకుంటున్నారు. రోజువారీ నిర్వహణ ఖర్చులను ఎప్పటికప్పుడు నమోదు చేయాల్సి ఉండగా.. విద్యార్థినుల చేత తమకనుగుణంగా లెక్కలు రాయించి డబ్బులను బొక్కేస్తున్నారు. తిన్నోళ్లకు తిన్నంత అన్న చందంగా అవినీతికి పాల్పడుతున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఈ తతంగాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు.
- శంషాబాద్ రూరల్

 శంషాబాద్ రూరల్:  జిల్లాలో 26 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలున్నాయి. వీటిలో కాంట్రాక్ట్ పద్ధతిన నియమితులైన స్పెషలాఫీసర్లు ఇష్టాసారంగా వ్యవహరిస్తున్నారు. దీంతో విద్యాలయాల ఏర్పాటు లక్ష్యం నీరుగారుతోంది. విద్యార్థినులకు అందాల్సిన భోజనంలో వడ్డించే గుడ్లు, పాలు, పండ్లను ఇవ్వకుండానే బిల్లులు దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరిపై ఉన్నతాధికారుల అజమాయిషీ, పర్యవేక్షణ లేకపోవడంతోనే వీరు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. మరో వైపు సిబ్బంది అవినీతిలో ఉన్నతాధికారులకు వాటాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. స్పెషలాఫీసర్, అకౌంటెంటు కుమ్మక్కై ఒక్కో విద్యాలయంలో నెలకు రూ.40 వేల నుంచి రూ.80 వేల వరకు నొక్కేస్తున్నట్లు సమాచారం.   

 నిధుల భోజ్యం తీరిలా..  
 విద్యాలయంలోని ఒక్కో విద్యార్థినికి భోజనం, పౌష్టికాహారం అందించడానికి నెలకు రూ.1000 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. విద్యాలయాల్లో విద్యార్థినుల హాజరును బట్టి ఈ మొత్తానికి సంబంధించి నివేదిక పంపిస్తే వీటి బిల్లులు మంజూరవుతుంటాయి.  ఇక్కడే సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రికార్డులను వారికి అనుకూలంగా మార్చుకుంటూ, విద్యార్థుల గైర్హాజరు, ఉపాధ్యాయుల స్వల్పకాలిక సెలవులను త ప్పుగా చూపుతూ అక్రమాలకు పాల్పడుతున్నారు. 

విద్యాలయాలు పునఃప్రారంభమై నెల దాటుతున్నా శంషాబాద్ మండలం పాల్మాకుల కస్తూర్బా విద్యాలయంలో ఇప్పటి వరకు కేవలం 10 రోజులు కూడా గుడ్డు ఇవ్వలేదు. విద్యార్థినులు ఇప్పటిదాకా అరటి పండు ముఖం చూడలేదు. పైగా వారికి రోజూ వారిగా అందించాల్సిన పాల కోటాలో కోతలు పెడుతూ లెక్కలు మాత్రం సరిగ్గానే రాసేస్తున్నారు. జూలై నెలకు సంబంధించిన లెక్కలను స్పెషలాఫీసర్ గానీ, అకౌంటెంటు వద్ద గానీ నమోదు చేసుకోకపోవడం గమనార్హం. ఈ బాధ్యతలను ఫుడ్ లీడర్‌లుగా ఎన్నుకున్న విద్యార్థినులకు అప్పగించారు.

ఈ నెల 15 వరకు విద్యార్థినులు (ఫుడ్ లీడర్లు) నమోదు చేసిన లెక్కల్లో 1500 గుడ్లు తేడా కనిపించింది. ఈ లెక్కన ఇప్పటి వరకు గుడ్లలో జరిగిన అవినీతి రూ.7500 లెక్క తేలింది. ఇక రోజూ 25-28 లీటర్ల పాలను తీసుకుంటున్నట్లు సిబ్బంది చెబుతుండగా.. విద్యార్థినులు రాసిన  రికార్డుల్లో ఒక్కో రోజు కేవలం 5 లీటర్ల నుంచి 20 లీటర్ల పాలు మించడంలేదు. బాలికలకు ఇప్పటి వరకు భోజనంలో ఒక్కసారి కూడా అరటి పండు ఇవ్వలేదు. ఇక బియ్యం నిల్వలను స్టాక్ పాయింట్ నుంచి పక్కదారి పట్టిస్తున్నట్లు సమాచారం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement