- ఉడకని అన్నం... నీళ్ల సాంబారు
- పెదబయలు కస్తూర్బా గాంధీ పాఠశాలలో అమలుకాని మెనూ
పెదబయలు: గిరిజన ప్రాంతమైన పెదబయలులోని క స్తూర్బా గాంధీ బాలికల పాఠశాల... ఇక్కడ 167 మంది విద్యార్థినులు ఉన్నారు... నిబంధనల ప్రకారం వారికి నాణ్యమైన విద్య అందించాలి... తగిన పౌష్టికాహారం అందజేయాలి... మధ్యాహ్నం భోజనానికి అన్నం, సాంబారు, ఒక కూరతో పాటు మజ్జిగ, ఉడికించిన గుడ్డు అందించాలి.
అయితే బుధవారం పాఠశాలలో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపించింది. ఉడకని అన్నం.. అందులోనూ రాళ్లు.. నీళ్లలా పలుచని సాంబారు, రుచిలేని వంకాయ కూర... ఇదీ విద్యార్థినులకు అందించిన మెనూ. మజ్జిగ, ఉడికించిన గుడ్డు కంచంలో ఎక్కడా కనిపించలేదు. విధిలేని పరిస్థితుల్లో విద్యార్థులు ఆ భోజనమే చేస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచీ ఇదే పరిస్థితి అని విద్యార్థినులు వాపోతున్నారు.
ఎందుకిలా...?
మండల కేంద్రంలో ఉన్న పాఠశాలలోనే మెనూ సరిగా అమలు కాకపోవడం, ఉప గిరిజన సంక్షేమ అధికారి కూడా ఇక్కడే ఉన్నా మెనూ అమలు తీరుతెన్నులపై దృష్టి పెట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
ఈ విషయంపై పాఠశాల ప్రత్యేక అధికారిణి సీహెచ్ సుధారాణి స్పందిస్తూ, కూరగాయల సరఫరాకు టెండరు దక్కించుకున్న కాంట్రాక్టర్ వాటిని పాఠశాలకు సక్రమంగా అందించట్లేదని చెప్పారు. అందువల్లే మెనూ కొంతమేరకే అమలు చేస్తున్నామని వివరణ ఇచ్చారు.
రెండేళ్ల నుంచి నీటి సమస్య...
ఈ పాఠశాలలో రెండేళ్ల నుంచి నీటి సరఫరా సరిగాలేక విద్యార్థినులు అష్టకష్టాలు పడుతున్నారు. ఒకేమోటర్‌తో నీరు తోడటంతో అందరికీ సరిపోవట్లేదు. ఎక్కువ మంది కాలకృత్యాలకు బయటకే వెళ్లాల్సిన పరిస్థితి. అంతేకాదు మినరల్ వాటర్ ప్లాంట్ మరమ్మతుకు గురవ్వడంతో తాగునీటికీ ఇబ్బంది తప్పట్లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాలలో మెనూ పక్కాగా అమలుకు చర్యలు తీసుకోవడంతో పాటు పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యార్థినులు కోరుతున్నారు.