పట్నవాసుల పల్లె టూరు | Patnavasula rural train | Sakshi
Sakshi News home page

పట్నవాసుల పల్లె టూరు

Published Mon, Feb 10 2014 11:45 PM | Last Updated on Thu, Jul 11 2019 5:37 PM

Patnavasula rural train

బియ్యం ఏ చెట్టుకి కాస్తాయనే నేటి తరం పిల్లల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెట్టుకునే బొట్టు, కట్టుకునే చీర, పాడే పాట, ఆడే ఆట....వీటన్నింటికీ పల్లెటూళ్లే నెలవని పాఠాల ద్వారా చెప్పడం కంటే ఒక్కరోజు పల్లెటూళ్లో గడిపే అవకాశం కల్పిస్తే వారి జీవితానికి సరిపడా పాఠాలు నేర్చుకునే అవకాశం దొరుకుంది. పల్లె ముఖం తెలియకుండా పట్టణంలోనే పుట్టి పెరిగిన విద్యార్థులకు పల్లెటూరి పరిమళాలను పరిచయం చేయిస్తున్న వైనం గురించి మరిన్ని వివరాలు....
 
 ‘‘ఆ రోజు పొద్దున నాలుగింటికే తెల్లవారిపోయినట్టు అనిపించింది.  ఆడవాళ్లు లేచి చీపుళ్లతో వాకిళ్లు  ఊడ్చే చప్పుడు కూడా వినిపిస్తోంది. ఆ చప్పుళ్లకు మాకు కూడా మెలకువ వచ్చేసింది. మేం పడుకుంది ఒక స్కూల్లో అయినా అది ఉంది ఓ మారుమూల గ్రామంలో కాబట్టి మా దినచర్య చాలా భిన్నంగా గడిచింది ఆరోజు. పొద్దున అట్లు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం పకోడీలు...అన్నీ ప్రత్యేకమే. పుట్టిపెరిగిందంతా హైదరాబాద్‌లోనే కావడంతో మేం వెళ్లిన గ్రామీణ పర్యటన ఎప్పటికీ మరిచిపోలేం’’
 
ఇంతింత కళ్లు చేసుకుని కృషిత చెప్పిన అనుభవం పట్టణంలో పుట్టిపెరిగిన ప్రతి విద్యార్థికీ కావాలి. ‘‘మా అమ్మాయి గ్రామీణ పర్యటనకు వెళతానని చెప్పగానే ఎంతో సంతోషంగా ఒప్పుకున్నాను. కారణం.. నేను కూడా ఇప్పటివరకూ పల్లెటూళ్లు చూడలేదు. గుజరాత్ పట్టణంలో పుట్టిపెరిగిన నాకు మా అమ్మాయి గ్రామీణవాతావరణం గురించి చెబుతుంటే భలే ముచ్చటగా అనిపించింది’’ - కృషిత తల్లి హీనా సంతోషం ఇది. పల్లెల జ్ఞాపకాలు అపురూపమవుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వరంగల్‌కి చెందిన తరుణి స్వచ్ఛంద సంస్థ  పట్టణాల్లోని విద్యార్థుల్ని పల్లెటూళ్లకు తీసుకెళుతోంది. కాసేపు పల్లె గాలిని పీల్చుకునే అవకాశం కల్పిస్తోంది.
 
పట్టణంలోనే పుట్టిపెరిగిన వారికి పల్లెటూరు గురించి ఎలా తెలుస్తుంది? అలాంటివారికి ఊరు పచ్చగా ఉంటుందని తెలుసు... కాని ఆ పచ్చదనం చుట్టూ ఉన్న  అసలైన అందాల గురించి తెలియదు. అలాగే అక్కడ ప్రజలు పడే కష్టాల గురించీ తెలియదు.  ప్రముఖ పట్టణాలకు, ఇంకాస్త డబ్బుంటే విదేశాలకు కూడా యాత్రలకు తీసుకెళ్లే పాఠశాలల గురించి వింటూనే ఉన్నాం. కానీ, పల్లెటూళ్లకు యాత్రలకు తీసుకెళ్లే పని ఎవరూ చేయడం లేదు. ఈ విషయం గురించి తరుణి స్వచ్ఛందసంస్థ ఆలోచిస్తుండగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ ఒక ప్రకటన చేసింది. గ్రామీణ పర్యాటకం పేరుతో గ్రామాల్లోని హస్తకళల అభివృద్ధికోసం పనిచేయాలని కోరింది. వెంటనే తరుణి ఆ ప్రాజెక్ట్ తీసుకుంది. హస్తకళల అభివృద్ధితో పాటు పల్లె జ్ఞాపకాల ప్యాకేజీని కూడా కలిపి పట్టణ విద్యార్థుల్ని పల్లెకి తీసుకెళ్లే ఏర్పాట్లు చేసుకుంది. 2012 డిసెంబర్ 7న మొదటిసారి హైదరాబాద్‌లోని సెయింట్ ఫిలోమినా పాఠశాల విద్యార్థుల్ని గ్రామీణ పర్యటనకు తీసుకెళ్లింది.
 
మా కల నెరవేరింది...

 
‘‘మహిళా వికాసం కోసం పనిచేస్తున్న మా సంస్థకు ఈ ప్రాజెక్ట్ రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. హైదరాబాద్ బేగంపేట సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజి విద్యార్థుల్ని ఒకసారి, న్యూ బోయిగూడలోని సెయింట్ ఫిలోమెనా హైస్కూల్ విద్యార్థుల్ని రెండుసార్లు వరంగల్‌లోని కొన్ని గ్రామాలకు పర్యటనకు తీసుకొచ్చాం. పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేశారు. దాంతో పాటు హస్తకళలకు సంబంధించిన వర్క్‌షాపుల్లో పాల్గొని ఎన్నో కొత్త విషయాలను తెలుసుకున్నారు’’ అని చెప్పారు తరుణి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు మమతా రఘువీర్.
 
ఆటలు... పాటలు... అన్నీ!

సెయింట్ ఫిలోమెనా స్కూల్లో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న సుబ్బలక్ష్మిగారి మాటల్లో చెప్పాలంటే పల్లెచూడని వారికి ఈ పర్యటన మంచి అవకాశం.‘‘కిందటేడు వరంగల్‌లోని పెంబర్తి, కొమరవెల్లి, చేర్యాల, లక్నవరం దగ్గర చుట్టుపక్కల గ్రామాల్లో గడిపిన జ్ఞాపకాలు నిజంగా చాలా విలువైనవి. ఓ 80   మంది పదోతరగతి విద్యార్థుల్ని తీసుకుని వెళ్లాం. తినే తిండి దగ్గర నుంచి అక్కడ పండించే పంటలు, కళలు,  సంప్రదాయాలు అన్నింటినీ గురించి వివరంగా తెలుసుకున్నారు. ఆ సమయంలో అక్కడ ఆడిన బతుకమ్మ ఆటలు, పెద్దవాళ్లు చెప్పిన కథల్ని మా విద్యార్థులు బాగా ఎంజాయ్ చేశారు.  ఈ పర్యటనలోని మరో విశేషం అక్కడి హస్తకళలపై పిల్లలకు స్పెషల్‌గా వర్క్‌షాపులు నిర్వహించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి’’ అని ముగించారు సుబ్బలక్ష్మి టీచర్.
 
ప్రత్యేక శిక్షణ
 
ఈ పర్యటనకు వెళ్లే విద్యార్థులు వారి ఖర్చులు వారే భరించాలి. ఒకటి లేదా రెండు రోజులు ఉండే పర్యటనలో దుస్తులు, కావాల్సిన వస్తువులు తీసుకుని బయలుదేరాలి. ఇప్పటివరకూ వెళ్లిన పర్యటనలలో వరంగల్ జిల్లా గ్రామాలు మాత్రమే ఉన్నాయి. అక్కడ చేర్యాల పెయింటింగ్, బచ్చన్నపేట మగ్గం పని, పెంబర్తిలో బొమ్మల తయారీ... వంటి హస్తకళలపై వర్క్‌షాపులు నిర్వహించి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. ‘‘గ్రామాల్లోని ప్రజలంతా విద్యార్థుల్ని సాదరంగా ఆహ్వానించారు. బొట్టు పెట్టడం నుంచి తిరిగొచ్చేటప్పుడు మా సంచుల్లో పండ్లు నింపడం వరకూ అన్ని మర్యాదలు మనస్ఫూర్తిగా చేశారు. వారి ఆతిథ్యాన్ని చూసి విద్యార్థులంతా ఆశ్చర్యపోయారు. పల్లెల్లోని వాతావరణమే, ప్రజల మనస్తత్వాలు కూడా స్వచ్ఛంగా ఉంటాయి అని  గ్రహించారు’’ అని తరుణి సంస్థ సభ్యురాలు సురేఖ చెప్పిన మాటలతో పల్లెటూరి గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ ఏకీభవిస్తారు.
 
- భువనేశ్వరి
 
 ఆహారం, వసతి అన్నీ గ్రామంలో ఏర్పాటు చేస్తారు. అలాగని పిల్లలకోసం ప్రత్యేకమైన ఏర్పాట్లేమీ ఉండవు.  ఆ గ్రామ ప్రజలు రోజూ ఏం తింటారో అదే పెడతారు. భోజనంలో ఆ ఊరి స్పెషల్ తప్పనిసరిగా ఉంటుంది.  పల్లెటూరి రుచుల రహస్యం తెలపడం కోసం వంట చేసే సమయంలో వీరిని తమ వెంటే వుంచుకుంటారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement