పోలీసుల విచారణ
అన్నానగర్: చైన్నెలో ‘చికెన్ రైస్’ తిన్న అథ్లెట్ విషాదకరంగా మరణించింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోయంబత్తూరులోని సుకునాపురానికి చెందిన రాబిన్ డెన్నిస్(40) కుమార్తె ఎలీనా లారెట్(15) బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి. ఈమె అదే ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 8 నుంచి 15వ తేదీ వరకు అంతర్ పాఠశాలల బాస్కెట్‌బాల్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో ఆడేందుకు ఎలీనా లారెట్ తన తోటి విద్యార్థులతో కలిసి రైలులో మధ్యప్రదేశ్ వెళ్లింది. పోటీ ముగించుకుని గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ రైలులో సోమవారం చైన్నెకి వచ్చారు. రైలు ప్రయాణంలో తినేందుకు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి చికెన్ రైస్ కొనుగోలు చేసింది.
విద్యార్థిని ఎలీనా లారెట్ తోటి విద్యార్థులతో కలిసి రైలులో చికెన్ రైస్, బర్గర్లు తిన్నట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర కడుపునొప్పితో వాంతులు, స్పృహ తప్పి పడిపోయింది. ఈ విషయాన్ని ఎలీనా లారెట్ చైన్నెలోని అన్నానగర్‌లో ఉన్న తన బంధువు డేవిడ్ విలియమ్స్‌కు చెప్పింది. రైలు చైన్నె చేరుకోగానే ఎలీనాను చికిత్స నిమిత్తం అన్నానగర్ 4వ అవెన్యూలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స అనంతరం ఎలీనా పెరవళ్లూరులోని మరో బంధువుల ఇంటికి వెళ్లింది.అక్కడికి వెళ్లిన కొద్దిసేపటి తర్వాత ఎలీనాకు మళ్లీ కడుపునొప్పి వచ్చింది. దీంతో ఆమె స్పృహతప్పి పడిపోయింది. వెంటనే బంధువులు ఆమెని పెరవళ్లూరులోని పెరియార్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో ఎలీనాను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. పెరవళ్లూరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఎలీనా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కీల్పాక్కం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పెరవళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చికెన్ రైస్ తిని విద్యార్థిని మృతి చెందిందా? లేక ఆమె మరణానికి మరేదైనా కారణాలు ఉన్నాయా? అనేది పోస్టుమార్టం నివేదిక తర్వాతే తేలనుందని పోలీసులు తెలిపారు. ఆడుకోవడానికి వెళ్లిన విద్యార్థిని ఆకస్మికంగా మృతి చెందడంతో కుటుంబసభ్యులు, తోటి విద్యార్థుల్లో తీవ్ర విషాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment