బీఆర్‌జీఎఫ్ ప్రణాళిక రెడీ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి (బీఆర్‌జీఎఫ్) కింద 2014-15 ఆర్థిక సంవత్సరానికి రూ.38.50 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ గిరిజాశంకర్ వెల్లడించారు. కలెక్టర్ చాంబర్‌లో బుధవారం జరిగిన జిల్లా ప్రణాళిక సంఘం సమావేశం జరిగింది. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ జనాభాతో పాటు గ్రామీణ, పట్టణ జనాభాను ప్రాతిపదికగా తీసుకుని ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. తాగునీరు, అంతర్గత రోడ్లు, పాఠశాల భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,కమ్యూనిటీ హాళ్లు తదితరాలకు ప్రణాళికలో ప్రాధాన్యమిచ్చామన్నారు. గ్రామ పంచాయతీలతో పాటు కొత్తగా ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యుల నుంచి కూడా బీఆర్‌జీఎఫ్ ప్రతిపాదనలు స్వీకరించామన్నారు.
స్థానిక సంస్థల నుంచి అందిన ప్రతిపాదనలను పరిశీలించి ప్రణాళిక ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ ప్రకటించారు. 2013-14లో రూ.42కోట్లతో బీఆర్‌జీఎఫ్ ప్రణాళిక సిద్ధం చేయగా, రూ.17 కోట్లు మాత్రమే విడుదలైనట్లు ప్రకటించారు. వివిధ పథకాల కింద మంజూరై నిధుల లేమితో అర్ధంతరంగా పనులు నిలిచిన చోట బీఆర్‌జీఎఫ్ నిధులు వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. చాలాచోట్ల కాంపౌండ్ వాల్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు వస్తున్నా, అత్యవసరమున్న చోటే మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ గిరిజాశంకర్ వెల్లడించారు.
తాగునీటి బోర్లువేసే అవకాశంపై నిలదీసిన సభ్యులు
బీఆర్‌జీఎఫ్ నిధుల నుంచి తాగునీటి బోర్లు వేసే అవకాశం లేకపోవడంపై పలువురు సభ్యులు అధికారులను ప్రశ్నించారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉన్న ప్రతిపాదనలు మాత్రమే ప్రణాళికలో చేర్చాలని ఎమ్మెల్యేలు కలెక్టర్‌కు సూచించారు. అయితే, గ్రామ, మండల స్థాయి నుంచి ఇప్పటికే ప్రతిపాదనలు తీసుకున్నందున కొత్తగా ఇప్పుడు తాము సమీక్షించేదేముందని సభ్యులు ప్రశ్నించారు.
దీంతో అధికారులు మాట్లాడుతూ ఎమ్మెల్యేలు కూడా మండలానికి రూ.5లక్షల చొప్పున పనులను నిబంధనల మేరకు ప్రతిపాదించే అవకాశముందని చెప్పారు. సమావేశంలో మాజీ మంత్రులు డీకే అరుణ, చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, అంజయ్య యాదవ్, గువ్వల బాలరాజు, రాజేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, సంపత్‌కుమార్, మర్రి జనార్దన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, వంశీచంద్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.