చెల్లి వెంటే.. అన్న
- సోదరితో యువకుడి అసభ్యప్రవర్తన
- మనస్తాపంతో బావిలో దూకిన చెల్లెలు
- ఆమెను రక్షించే క్రమంలో అన్న దుర్మరణం
బంట్వారం(వికారాబాద్): చెల్లెలితో ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు.. మనోవేదనకు గురైన ఆమె బావిలో దూకింది. సోదరిని రక్షించేందుకు అన్న సైతం బావిలో దూకాడు. అతడికి ఈత వచ్చినా.. సమాంతరంగా ఉన్న బావిలో సరైన పట్టు దొరకకపోవడం.. భయాందోళనకు గురైన చెల్లెలు అతడిని గట్టిగా పట్టుకోవడంతో ఇద్దరూ నీట మునిగి తిరిగి రాని లోకాలకు వెళ్లారు.
వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం తొర్మామిడికి చెందిన అగ్గనూరు కిష్టయ్య, పార్వతమ్మ దంపతులకు కుమారుడు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. చిన్న కూతురు అనిత(17) తాండూరులోని ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. కుమారుడు సంగమేశ్ (20) ఐటీఐ పూర్తి చేసి చిన్నాచితకా పను లు చేసుకుంటూ తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటున్నాడు. అయితే, శుక్రవారం అనిత కాలేజీకి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చింది. కొద్దిసేపటి తర్వాత ఆమె బహిర్భూమికి వెళ్లింది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన యువకుడు దిలీప్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో మనోవేదనకు గురైన ఆమె సమీపంలో ఉన్న బావిలో దూకేసింది.
చెల్లిని కాపాడబోయిన అన్న..
అనితతో దిలీప్ అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెలుసుకున్న ఆమె అన్న సంగమేశ్ చెల్లెలు వద్దకు రాగా అంతలోనే అనిత అక్కడే ఉన్న ఓ వ్యవసాయ బావిలో దూకేసింది. తన కళ్ల ముందే చెల్లెలు బావిలో దూకడంతో సంగమేశ్ నిర్ఘాంతపోయాడు. చెల్లిని కాపాడేందుకు అతడు కూడా బావిలో దూకాడు. సంగమేశ్‌కు ఈత వచ్చినప్పటికీ బావి సమాంతరంగా ఉండటంతో అతడికి పట్టు దొరకలేదు. తీవ్ర భయాందోళనకు గురైన అనిత బావిలో అన్నను గట్టిగా పట్టుకుంది. దీంతో అన్నాచెల్లెలు బావిలో నీటమునిగి మృత్యువాత పడ్డారు. ధారూరు సీఐ ఉపేందర్ ఘటనా స్థలానికి చేరుకుని అదేరోజు రాత్రి అనిత, సంగమేశ్‌ల మృతదేహాలను బయటకు తీసే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. శనివారం స్థానిక యువకుడు అతికష్టం మీద అనిత, సంగమేశ్ మృతదేహాలను బయటకు తీశాడు. మృతుల కుటుంబీ కుల ఫిర్యాదు మేరకు దిలీప్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ ఉపేందర్ తెలిపారు.
ఆదుకుంటావనుకున్నం కొడుకా..
అన్నాచెల్లెలు అనిత, సంగమేశ్ మృతి చెందడంతో వారి తల్లిదండ్రులు కిష్టయ్య, పార్వతమ్మ దంపతులు రోదనలు మిన్నంటాయి. చేతికి అందివచ్చిన కొడుకు మృత్యువాత పడటంతో గుండెలు బాదుకుంటూ రోదించారు. ఆదుకుంటావనుకున్నం కొడుకా.. ఆ దేవుడు ఎంత పనిచేశాడు.. నిన్ను మా నుంచి దూరం చేశాడని విలపించారు. కుమార్తె అనితను తలచుకొని కన్నీటిపర్యంతమయ్యారు. ఉన్నత చదువు చదివి ఉద్యోగం చేస్తావనుకున్నాం తల్లీ.. ఎంత పనిచేశావమ్మా.. అంటూ ఆమె మృతదేహంపై పడి రోదించిన తీరు అందరినీ కదిలించింది.