కొల్లాపూర్(కోడేర్): మూఢనమ్మకమనే భూతం జడలు విప్పింది. హైటెక్‌యుగంలో అటవికచర్య చోటుచేసుకుంది. బాణామతి నెపంతో ఓ వ్యక్తిపై కిరోసిన్‌పోసి నిప్పంటించి సజీవదహనం చేశారు. సంచలనం రేకెత్తించిన ఈ ఘటన మంగళవారం మండలంలోని రాజాపూర్‌లో వెలుగుచూసింది. మరో సంఘటనలో చేతబడి నెపంతో మహిళను చితకబాదారు. పోలీసులు, బాధితుల కథనం మేరకు.. రాజాపూర్ గ్రామానికి చెందిన తెలుగు పాలకొండ రాములు(47), అతని భార్య బాలకిష్టమ్మ సోమవారం సాయంత్రం వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికొచ్చారు.
ఇదిలా ఉండగా, ఇదే గ్రామానికి చెందిన నంది కుర్మయ్య పెద్దకొడుకు ఆంజనేయులు ఇటీవల మృతిచెందడంతో బాణామతి చేసి మీరే చంపారంటూ రాములును రచ్చకట్ట వద్దకు మంగళవారం ఈడ్చుకెళ్లారు. కుర్మయ్య కులస్తులు కుర్మయ్య, మద్దిలేటి, ఎర్రయ్య, దత్తయ్య, రాములమ్మ, లక్ష్మి, బాగ్యమ్మ, భారతితో అక్కడికి వచ్చారు. వారిలో కొందరు రాములుపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. దీంతో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతుండగా స్థానికులు గమనించి చికిత్సకోసం కొల్లాపూర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
నిందితులను వదిలిపెట్టం : సీఐ
ఘటనస్థలాన్ని కొల్లాపూర్ సీఐ రాఘవరావు రాజాపూర్‌కు చేరుకుని విచారించారు. రాములును అమానుషంగా సజీవ దహనం చేసిన నిందితులపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలే తప్ప చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుంటే సహించేదిలేదన్నారు. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొల్లాపూర్‌కు తరలించి నిందితులపై కేసునమోదు చేసినట్లు తెలిపారు. సీఐ వెంట కోడేరు ఎస్‌ఐ వెంకటరమణ, పెద్దకొత్తపల్లి ఎస్‌ఐ ఉన్నారు.
నిందితులపై చర్యలు తీసుకోవాలి
శాస్త్ర సాంకేతికరంగాల్లో పయనిస్తున్న ఈ రోజుల్లో చేతబడి అనుమానంతో రాజాపూర్‌కు చెందిన తెలుగు రాములును సజీవదహనం చేయడం అత్యంత దుర్మార్గమని, నిందితులను శిక్షించి బాధిత కుటుంబానికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్, సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు యేసయ్య డిమాండ్ చేశారు.
మరో మహిళపై దాడి
హన్వాడ (మహబూబ్‌నగర్ క్రైం): బాణామతి నెపంతో ఓ మహిళపై నలుగురు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కోయిల్‌కొండ మండల కేంద్రానికి చెందిన సరోజ హన్వాడ మండలంలోని బుద్దారం గ్రామానికి చెందిన కంచిమి వెంకటనర్సమ్మకు గతంలో కొంత నగదును అప్పుగా ఇచ్చింది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం సరోజ అప్పు అడిగేందుకు బుద్దారం వచ్చింది. మధ్యాహ్నం ఇంటికి తిరిగి వెళ్లేందుకు ఆమె రోడ్డుపై నడుచుకుంటూ వస్తోంది.
ఇంతలో వెంకటనర్సమ్మకు బంధువులు అగు బాలమ్మ , చెన్నప్ప, బాలప్ప, మణెమ్మలు తమ పిల్లలకు అనారోగ్యానికి గురైయ్యారని ఇందుకు సరోజ తన పిల్లలకు చేతబడి చేసిందని అనుమానిస్తూ ఆమెను గ్రామంలోనే పట్టుకుని చితకబాదారు. దీంతో గ్రామస్తులు కలుగజేసుకుని పోలీసులకు సమాచారమందించారు. బాధితురాలు సరోజ ఫిర్యాదుమేరకు దాడిచేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చికిత్సకోసం బాధితురాలిని జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ బాలునాయక్ తెలిపారు.
దారుణం
Published Wed, Jan 7 2015 4:50 AM | Last Updated on Sat, Sep 2 2017 7:19 PM
Advertisement
Advertisement