మరో పదిరోజుల్లో శాసనమండలి హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నిక జరగనుంది. పోలింగ్ గడువు సమీపిస్తుండడంతో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ ప్రచార పర్వంలో ముందుండగా.. తొలిసారి అభ్యర్థిని నిలిపిన కాంగ్రెస్‌లో సమన్వయ లోపం కనిపిస్తోంది. 32మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నా ఒకరిద్దరు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే పూర్తిస్థాయి ప్రచారంపై దృష్టి సారించారు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : టీఎన్జీఓ సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్‌ను పట్టభద్రుల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలిపిన టీఆర్‌ఎస్ బహుముఖ ప్రచారంపై దృష్టి సారించింది. ఓటర్ల నమోదులో టీఆర్‌ఎస్ క్రియాశీలంగా వ్యవహరించకపోవడంతో ప్రస్తుతం విస్తృత ప్రచారం ద్వారా గట్టెక్కాలనే ప్రయత్నంలో ఉంది.
జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి ప్రచార వ్యూహం సిద్ధం చేశారు. ఇప్పటికే మూడు విడతలుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దేవీప్రసాద్ తిరిగి 13, 14, 16 తేదీల్లో జిల్లాకు రానున్నారు. గతంలో వాయిదాపడిన జడ్చర్ల, అచ్చంపేట నియోజకవర్గ స్థాయి సమావేశాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓ వైపు పార్టీ యంత్రాంగంపై ఆధారపడుతూనే వివిధవర్గాల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. సీపీఐ ఇప్పటికే మద్దతు ప్రకటించగా, జేఏసీ భాగస్వామ్య సంఘాలు బృందాలుగా ప్రచారం చేస్తున్నాయి. ఫ్లెక్సీలు, పోస్టర్లు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు. బహిరంగ సభలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో హాల్ మీటింగ్స్ ద్వారా మద్దతు కూడగట్టే దిశగా టీఆర్‌ఎస్ వ్యూహం సాగుతోంది.
చాపకింద నీరులా బీజేపీ
రెండుసార్లు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా రాంచందర్‌రావు పోటీ చేశారు. వరుసగా మూడో పర్యాయం ఎన్నికల బరిలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఓటరు నమోదు ప్రక్రియ నుంచే చురుగ్గా వ్యవహరిస్తున్న బీజేపీ అభ్యర్థి ప్రచారం చాపకింద నీరులా కనిపిస్తోంది. పార్టీ, అనుబంధ సంఘాల నేతలు ప్రచార బాధ్యతను భుజాలపై వేసుకుని పనిచేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మూడు పర్యాయాలు జిల్లాలో ప్రచారం నిర్వహించారు. ప్రైవేటు కాలేజీలు, బార్ అసోసియేషన్లు, రిటైర్డు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు లక్ష్యంగా ప్రచారం సాగుతోంది. హాల్ మీటింగ్స్‌ను విస్తృతంగా జరిపేందుకు పూర్తిస్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు.
కాంగ్రెస్ ఒంటరి పోరు
పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల బరిలో తొలిసారిగా అభ్యర్థిని నిలిపిన కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో మాత్రం సమన్వయ లోపం కనిపిస్తోంది. పార్టీ ముఖ్యనేతలు కొందరు.. తమను సంప్రదించకుండా పార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పీసీసీ నుంచి సమన్వయకర్తలను నియమించినా ఇప్పటివరకు సమష్టిగా ప్రచారం జరిగిన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు.
అయితే అభ్యర్థి రవికుమార్ గుప్తా మాత్రం కలిసి వచ్చే పార్టీ నేతలతో పాటు విద్యాసంస్థలు, బార్ అసోసియేషన్లు లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. వీలైనచోట హాల్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా నుంచి నలుగురు అభ్యర్థులు స్వతంత్రులుగా బరిలో ఉన్నా ప్రచారంలో కనిపిం చడం లేదు. స్వతంత్ర అభ్యర్థి రాకొండ సుభాష్‌రెడ్డి పాలమూరు యూనివర్సిటీ విద్యార్థుల మద్దతుతో ప్రచారం నిర్వ హిస్తున్నారు.
మండలి వేడి
Published Wed, Mar 11 2015 1:43 AM | Last Updated on Thu, Mar 28 2019 5:27 PM
Advertisement
Advertisement