క్షణం తీరిక లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేయాల్సిన నేటి తరుణంలో సేదతీరే సమయం కూడా ఉండదు. విధులు ముగించుకుని నిశిరాత్రిలో ఇంటికి వచ్చినా.. అలా ఆకాశం వైపు చూస్తూ.. నక్షత్రాలను చూసే భాగ్యమూ ఉండదు. ఇల్లు, వీధిలో ఉన్న విద్యుత్ దీపాలే.. అసలు ప్రపంచంగా గడిపేస్తుండటం చూస్తుంటాం. అయితే వీరిలో చాలామంది చిన్నప్పుడు గ్రామీణ వాతావరణం నుంచి వచ్చినవారే. కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో వాటన్నింటినీ దూరమైన వీరు నాటి జ్ఞాపకాలతో బతికేస్తుంటారు. ఇలాంటి జీవితాన్ని, వాతావరణాన్ని కళ్లముందు సాక్షాత్కరింపజేస్తోంది ఓ ప్రైవేటు సంస్థ. గ్రాస్‌వాక్ పేరుతో పచ్చని ప్రకృతిలో క్యాండిల్‌లైట్ డిన్నర్‌ను ఏర్పాటు చేస్తూ నగర ప్రజలను ఆకట్టుకుంటోంది.
వికారాబాద్ అర్బన్ : సువిశాల అటవీ ప్రాంతం.. చుట్టూ పచ్చని చెట్లు.. పక్షుల కిలకిలరావాలు.. ఆ మధ్యే చల్లని గాలులు. వివిధ రకాల పక్షులు కనువిందు చేస్తుంటాయి. ఇలాంటి వాతావరణం వికారాబాద్ పట్టణానికి కేవలం తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడుపల్లి పరిధిలో గ్రాస్‌వాక్ గుట్టపై కనిపిస్తుంది. ఇక్కడి వాతావరణం ఎంతటి స్వచ్ఛత అంటే.. 50 ఏళ్ల వెనక అటవీ ప్రాంతంలోని పల్లెటూరి వాతావరణానికి అతి దగ్గరగా ఉంటుంది. అక్కడున్నంతసేపూ మనల్ని మనం మరచిపోతామంటే.. అతిశయోక్తి కాదు.
ఆన్‌లైన్ బుకింగ్..
ఇందులో ఒకరోజు గడపాలనుకుంటే www. thegrasswalk.com సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలి. నేరుగా కూడా వెళ్లవచ్చు. అయితే అక్కడ గుడారాలు ఖాళీగా ఉంటేనే అవకాశం ఉంటుంది. లేనిపక్షంలో వెనుతిరిగి రావాల్సిందే. ఆన్‌లైన్‌లో మీకు కన్ఫర్మ్ అయ్యిందంటే.. ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటలకు లోపలికి అనుమతిస్తారు. మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు అందులో గడపవచ్చు. భార్యాభర్తలతో పాటు ఇద్దరు పిల్లలు ఉంటే 24 గంటలకు రూ.3,300 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో కేవలం ఉదయం టిఫిన్ మాత్రమే అందిస్తారు. రాత్రి డిన్నర్ గెస్టులు ఇచ్చిన ఆర్డర్‌పై చేసి ఇస్తారు. నలుగురి కంటే.. సంఖ్య పెరిగితే ఒక్కొక్కరికి అదనంగా రూ.1,000 చార్జ్ చేస్తారు. రూ.3,300లోనే పగటి పూట, సాయంత్రం వేళల్లో ట్రెక్కింగ్, స్విమ్మింగ్ చేయిస్తారు.
క్యాండిల్‌లైట్ డిన్నర్ ప్రత్యేకత..
గ్రాస్‌వాక్‌లో క్యాండిల్‌లైట్ డిన్నర్ ప్రత్యేకం. సువిశాలమైన ఈ ప్రాంతంలో వంద మీటర్ల దూరంలో అంతకంటే ఎక్కువ దూరంలో గుడారాలు వేస్తారు. అందులో అన్నిరకాల సౌకర్యాలు ఉంటాయి. కానీ.. రాత్రి పూట క్యాండిల్‌లైట్ వెలుతురులో డిన్నర్ ఏర్పాటు చేస్తారు. ఇలాంటి డిన్నర్ చేయడానికి పట్టణ వాసులు ఎంతగానో ఇష్టపడతారు. ఆర్డర్‌పై వెజ్, నాన్‌వెజ్ వంటకాలు చేసి పెట్టడానికి సహాయకులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.
ఎలా వెళ్లాలి..
హైదరాబాద్ నుంచి వికారాబాద్ దూరం 70 కి.మీ. ఉంటుంది. హైదరాబాద్ నుంచి వచ్చే వారు వికారాబాద్‌లోకి రాగానే ఎన్నెపల్లి నుంచి ఎడమకు తిరగాలి. నస్కల్ – పరిగి రూట్ లేదా వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం దారిలో వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి నేరుగా 8 కి.మీ. లోనికి వెళ్లాక.. గుడుపల్లి గ్రామ బస్‌స్టాప్ వస్తుంది. అక్కడి నుంచి ఎడమకు తిరిగి ఒక కిలోమీటర్ ముందుకు వెళితే.. గ్రాస్‌వాక్ చేరుకుంటాం.
క్యాండిల్‌లైట్ డిన్నర్.. అడవిలో
Published Thu, Nov 23 2017 4:38 AM | Last Updated on Wed, Sep 26 2018 5:59 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment