
ఉగ్రవాది ఖాజాపై కేసు కొట్టివేత
హైదరాబాద్ సిటీ : లష్కర్-ఎ-తోయిబా (ఎల్‌టీ) ఉగ్రవాద సంస్థ సౌత్ ఇండియా ఆపరేషన్ చీఫ్ షేక్ అబ్దుల్ ఖాజా అలియాస్ అంజాద్‌పై నమోదైన నకిలీ పాస్‌పోర్టు, నకిలీ నోట్ల కేసును నాంపల్లి ఫస్ట్ అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు శుక్రవారం కొట్టివేసింది. సాక్ష్యాధారాలు రుజువు చేయడంలో పోలీసులు విఫలం కావడంతో ఖాజాపై ఉన్న కేసును కోర్టు కొట్టేసింది. మలక్‌పేటకు చెందిన ఖాజా బేగంపేటలోని నగర కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయం (ప్రస్తుతం సికింద్రాబాద్‌కు మారింది)పై 2005 అక్టోబర్ 12న జరిగిన మానవ బాంబు దాడి కేసులో 9వ నిందితుడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న ఖాజాను జనవరి 18, 2010న అఫ్జల్‌గంజ్‌లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) ఇన్‌స్పెక్టర్ మధుకర్‌స్వామి అరెస్టు చేశారు.
ఆ సమయంలో అతని నుంచి కరాచీ నివాసి మహ్మద్ ఫరాన్ అనే పేరుతో పాకిస్తాన్‌కు చెందిన పాస్‌పోర్టు, రూ.50 వేలు నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ బాంబు పేలుడు కేసులో ఇతడిని అదే రోజు రిమాండ్ చేయగా, అతనిపై సిట్ అధికారులు నకిలీపాస్‌పోర్టు, నకిలీ నోట్ల కేసు నమోదు చేశారు. ఈ కేసులో చార్జ్‌షీట్ వేయడంతో కోర్టులో విచారణ ప్రారంభమైంది. విచారణలో పోలీసులు అతనిపై చేసిన ఆరోపణలను రుజువు చేయలేకపోవడంతో కేసు వీగిపోయింది. ఖాజాపై ఈ కేసు కొట్టివేసినా టాస్క్‌ఫోర్స్ బాంబు పేలుడు కేసులో నిందితుడిగా ఉండటంతో అతను ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నాడు. అఫ్జల్‌గంజ్‌లో అరెస్టు చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆవరణలో చెట్టుకింద పాస్‌పోర్టు ఎలా సీజ్ చేశారని ఖాజా తరపు న్యాయవాది అజీమ్ ప్రశ్నించడంతో కేసు వీగిపోయింది.