
అక్రమ కట్టడాలపై ఉప్పందిస్తే రివార్డు..!
♦ రూ.5 వేల నుంచి రూ.10 వేల నగదు బహుమతి
♦ రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ఆలోచన
♦ ప్రతిపాదనలను ఆమోదించిన మంత్రి కేటీఆర్
♦ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో అమలు
♦ ఒకట్రెండు రోజుల్లో వెలువడనున్న ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎక్కడైనా అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలు, లేఅవుట్లను నిర్మిస్తున్నట్లు ఉప్పందించిన సామాన్య ప్రజలకు నజరానా అందనుంది. అక్రమ కట్టడాలపై సమాచారం ఇచ్చిన వారికి నగదు బహుమతిని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ఆలోచన చేస్తోంది. జీహెచ్‌ఎంసీతో పాటు రాష్ట్రంలోని మిగిలిన 67 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సి పాలిటీలు, నగర పంచాయతీల్లో ఈ కొత్త పథకాన్ని త్వరలో ప్రవేశపెట్టనుంది. అక్రమ కట్టడాలు, లే అవుట్ల గురించి ఉప్పందించిన వ్యక్తుల సమాచారం నిజమేనని తేలితే వారికి రూ.5 వేలు లేదా రూ.10 వేలను రివార్డుగా అందించాలని ఆలోచన చేస్తోంది. జీహెచ్ ఎంసీ ప్రతిపాదించిన ఈ వినూత్న కార్య క్రమానికి తాజాగా రాష్ట్ర పురపాలక మంత్రి కె.తారకరామారావు ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తెస్తూ ఒకట్రెండు రోజుల్లో పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. అనుమతులు లేకుండానే నిర్మాణాలను జరుపుతుం డడంతో మున్సిపా లిటీలు ఆదాయాన్ని నష్టపోతున్నాయి. ఈ కొత్త పథకాన్ని అమలు చేయడం ద్వారా మున్సిపాలిటీలకు ఆదాయం కూడా పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
గజిబిజిగా పట్టణీకరణ..
స్థానిక పురపాలికల నుంచి అనుమతులు పొందకుండానే విచ్చలవిడిగా నిర్మిస్తున్న అక్రమ కట్టడాలు, లేఅవుట్లను నియంత్రించడం పురపాలక శాఖకు సవాలుగా మారింది. ప్రధానంగా పురపాలికల్లో తీవ్ర సిబ్బంది కొరత ఉండడంతో అక్రమ కట్టడాలు, లేఅవుట్లను గుర్తించి చర్యలు తీసుకోవడంలో ఆ శాఖ విఫలమవుతోంది. పురపాలికల పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, సిబ్బంది సైతం అనధికార కట్టడాలు, లేఅవుట్ల యజమానులతో కుమ్మక్కై చర్యలు తీసుకోకుండా మిన్నుకుండిపోతున్నారు. దీంతో కొత్తగా పుట్టుకొస్తున్న అక్రమ కట్టడాలు, లేఅవుట్లకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. మున్సిపాలిటీల నుంచి అనుమతులు తీసుకోకపోవడమే కాక భవన నిర్మాణ శాస్త్రీయ పద్ధతులకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా కట్టడాలను నిర్మిస్తుండడంతో నగరాలు, పట్టణాల రూపురేఖలు గజిబిజిగా మారాయని ఇప్పటికే పలు సమీక్షల్లో సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
అడ్డగోలు నిర్మాణాలతో పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులను చేపట్టడంలో సైతం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. అక్రమ కట్టడాలు, లేఅవుట్లను నిర్మాణ దశలోనే గుర్తించి ఎక్కడికక్కడ కూల్చి వేయాలని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. నిర్మాణ దశలోనే అక్రమ కట్టడాలు, లేఅవుట్లను గుర్తించడానికి తగి నంత మంది సిబ్బంది లేకపోవడంతో స్థానిక పౌరుల నుంచే సమాచారాన్ని స్వీకరించాలని ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది. పౌరులు అందించే సమాచారాన్ని రహస్యంగా ఉంచి, చర్యలు తీసుకోవడానికి అన్ని పురపాలికల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది.