పల్లెల ప్రగతి కోసమే.. గ్రామజ్యోతి | Cauldron for the growth of rural village | Sakshi
Sakshi News home page

పల్లెల ప్రగతి కోసమే.. గ్రామజ్యోతి

Published Fri, Aug 14 2015 1:57 AM | Last Updated on Thu, May 24 2018 2:02 PM

Cauldron for the growth of rural village

ప్రజలు సంఘటిత శక్తిగా కదలాలి  
అభివృద్ధిలో భాగస్వాములు కావాలి  
నిధులు వస్తాయనే భ్రమలు వీడాలి  
అందుబాటులోని నిధులు వాడాలి  
గ్రామసభలో నిర్ణయాలు జరగాలి  
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి  

 
హన్మకొండ :  పల్లెల అభివృద్ధి కోసమే గ్రామజ్యోతి కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ప్రజలు సంఘటితంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. గురువారం హన్మకొండలోని జెడ్పీ సమావేశ మందిరంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండల  నోడల్ అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో గ్రామజ్యోతిపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామజ్యోతిలో ప్రజలు భాగస్వాములు అయ్యేలా అధికారులు అవగాహన  కల్పించాలన్నారు. గ్రామజ్యోతి అనగానే ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయనే        భ్రమలు వీడాలన్నారు. అందుబాటులో          ఉన్న నిధులతో ప్రాధాన్యత క్రమంలో  పనులు గుర్తించాలన్నారు. గ్రామసభ నిర్వహించి పనులు గుర్తించాలన్నారు. ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల నియోజక అభివృద్ధి నిధులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు, గ్రామపంచాయతీ ఆదాయం వీటి ఆధారంగా ప్రాధాన్యత క్రమంలో పనులు గుర్తించాలన్నారు. ప్రభుత్వం నిధులు ఇస్తేనే అభివృద్ధి జరుగుతుందని భావించవద్దన్నారు.

 గంగదేవిపల్లి స్ఫూర్తి
 ప్రజల భాగస్వామ్యంతో సంపూర్ణ అభివృద్ధికి స్ఫూర్తి గంగదేవిపల్లి గ్రామం అని కడియం అన్నారు. గంగదేవిపల్లి ప్రజలు అందుబాటులో ఉన్న నిధులతో అభివృద్ధి చేసుకున్నారన్నారు. 25 కమిటీలు వేసుకొని ఈ కమిటీల ఆధ్వర్యంలో ఒక్కో పనిని చేసుకుంటున్నారన్నారు. గ్రామ ఆర్థిక స్థితిగ తులు కాని, గ్రామంలో శ్రీమంతులు ఎవరు లేరన్నారు. అయినా సంఘటితంగా ముందుకు సాగి ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచారన్నారు. గ్రామంలో ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి ఉంటుందన్నారు.

 గుడుంబా తయారి, విక్రయాలు లేవన్నారు. గ్రామంలో ఎక్కడైన చెత్త ఉంటే సమష్టిగా తొలగిస్తారన్నారు. ఈ గ్రామానికి సందర్శకుల తాకిడి అధికంగా ఉందన్నారు. సందర్శకులు రూ.2,500 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల్లో ఎవరి ఇష్టానుసారం వారు ఓటు వేస్తారన్నారు. జిల్లాలో మరిన్ని గ్రామాలు గంగదేవిపల్లిగా అభివృద్ధి సాధించాలన్నారు. ఈ దిశగా సర్పంచులు, అధికారులు కృషి చేయాలన్నారు.

 అభివృద్ధిలో పోటీ పడతాం..
 2011 జనాభా లెక్కల ప్రకారం మానవ వనరుల అభివృద్ధిలో జిల్లా వెనకబడి ఉందన్నారు. కొత్త రాష్ట్రం అనేక సవాళ్లు, సమస్యలు ఎదుర్కొంటుందన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను అనుకున్న మేరకు అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. చేసే కార్యక్రమాలు ప్రణాళికబద్ధంగా, ప్రాధాన్యత క్రమంలో చేయాలని సూచించారు. జిల్లా అనేక అంశాల్లో వెనకబడి ఉన్నామన్నారు. గుడుంబా తయారి, విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయన్నారు. 25 ఏళ్ల యువతికి పింఛన్ ఇవ్వాల్సిన దారుణ పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్ మహబూబాబాద్ నుంచి గుడుంబా నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తలచుకుంటే అభివృద్ధిలో వరంగల్‌ను రాష్ట్రంలో ఆదర్శ జిల్లాగా నిలపవచ్చన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పోటీ పడి పని చేద్దామన్నారు.

ఎవరు మందు స్థానంలో ఉంటారో చూద్దామన్నారు. ప్రజలకు చేరువుగా పథకాలు తీసుకెళ్లాలన్నారు. వ్యక్తిగత ఇబ్బందులంటే ముందుగానే తప్పుకోవాలని, ఇష్టం లేని పనులు చేసి అప్రతిష్ట తీసుకురావద్దని అధికారులకు సూచించారు. గ్రామజ్యోతిలో ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేయాలన్నారు. ప్రతి గ్రామంలో డంపింగ్‌కు ఎకరం నుంచి ఎకరంన్నర వరకు, స్మశాన వాటికకు అర ఎకరం స్థలం గుర్తించాలన్నారు. ప్రభుత్వ స్థలం లేకుంటే ప్రైవేటు స్థలాన్ని గుర్తించాలన్నారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద కొనుగోలు చేద్దామన్నారు. సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులు మిగిలిపోతే గుర్తించి వారి వివరాలు కలెక్టర్‌కు అందించాలని సూచించారు.

 గ్రామాలను దత్తత తీసుకోవాలి..
 ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు గ్రామాలను దత్తత తీసుకోవాలని సూచించారు. గ్రామజ్యోతిలో శానిటేషన్‌కు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలన్నారు. తాను పది నియోజకవర్గాల్లో పది గ్రామాలను దత్తత తీసుకోనున్నట్లు చెప్పారు. దత్తత తీసుకొన్న గ్రామాల వివరాలు అధికారులు కలెక్టర్‌కు అందించాలని సూచించారు. గ్రామాలకు సంబంధించిన పూర్తి వివరాలు నోడల్ అధికారుల వద్ద ఉండాలన్నారు. రెండవ గ్రామజ్యోతిలో అక్షరాస్యతకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. జాతీయ సగటు అక్షరాస్యతను మించి అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా పెట్టుకోనున్నట్లు చెప్పారు. ఈనెల 16వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో గ్రామజ్యోతి సమావేశాలు నిర్వహించాలన్నారు. ఇందులో ఎమ్మెల్యే, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, అధికారులు భాగస్వాములను చేయాలన్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ధర్మాసాగర్ మండలంలోని మల్లికుదుర్ల, షోడాషపల్లి, గుండ్ల సాగరం గ్రామాలను దత్తత తీసుకోవాలన్నారు.

 ఈ సమావేశంలో కలెక్టర్ వాకాటి కరుణ, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎస్పీ అంబర్ కిషోర్ ఝా, కమిషనర్ సుధీర్‌బాబు, జేసీ ప్రశాంత్ పాటిల్ పాల్గొన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement