ముకరంపుర : గృహ నిర్మాణ పథకంలో చోటుచేసుకున్న అవి నీతి, అక్రమాల అంతుతేల్చడానికి సీబీసీఐడీ రంగంలోకి దిగింది. ‘ఇంటి’దొంగల భరతం పట్టేందుకు చర్య లు ముమ్మరంచేసింది. ఇల్లు లేని పేదలకు రూ.3.50 లక్షల వ్యయంతోడబుల్ బెడ్‌రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తామని తెలంగాణసర్కారు ప్రకటించింది. దీనికి ముందే గతంలో గృహనిర్మాణాల్లో జరిగిన అవినీతిని తవ్వి అక్రమార్కుల చిట్టాబయటపెట్టాలని నిర్ణయించింది.
అక్రమాలకు ఝలక్‌ఇవ్వడం ద్వారా కొత్త పథకంలో సాధ్యమైనంత వరకు అవినీతిని అరికట్టవచ్చని భావిస్తోంది. ఈ నేపథ్యంలోముఖ్యమంత్రి కేసీఆర్ ఇందిరమ్మ ఇళ్లనిర్మాణంలో నిధులు దుర్వినియోగడం కావడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇటీవల జిల్లాలో నమూనా సర్వేలునిర్వహించగా పలు అక్రమాలు బయటపడ్డాయి. దీంతోమరింత లోతుగా విచారించాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో సీబీసీఐడీ దూకుడుగా వ్యవహరిస్తోంది.సీబీసీఐడీ అధికారులు గురువారం కలె క్టరేట్‌లోని గృహనిర్మాణ శాఖ కార్యాలయంలో పలు రికార్డులు పరిశీలించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, అందులో జరిగిన అవినీతి, అక్రమాలు, బాధ్యులైన సిబ్బంది, కేసులకు సంబంధించిన వివరాలను సేకరించారు. హౌస్‌హోల్డ్ సర్వేపై సీఎం కేసీఆర్‌తో జిల్లా అధికారులు శుక్రవారం హైదరాబాద్‌లో సమావేశం కానున్న నేపథ్యంలో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.
అక్రమార్కుల్లో గుబులు
ఇప్పటివరకు దళారులు, ప్రజాప్రతినిధులే ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అక్రమార్జనకు పాల్పడ్డారని భావించినప్పటికీ.. గృహనిర్మా ణ శాఖలో పనిచేస్తున్న పలువురు అధికారు లు, సిబ్బంది హస్తం కూడా ఉన్నట్లు తేలింది. ఈ మేరకు 2004 నుంచి 2006 వరకు జరిగిన అవినీతి చిట్టాలో ఉన్న సిబ్బంది వివరాలతో గృహనిర్మాణ శాఖ పీడీ జాబితాను సిద్ధం చేశారు. సీబీసీఐడీ అధికారులు ఇప్పటివరకు సంబంధిత శాఖతో పాటు ఇతర శాఖల నుంచి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవినీతికి సంబంధించిన 42 కేసుల వివరాలను తీసుకున్నారు. క్రిమినల్ కేసులపై ఆరా తీశారు. అవినీతిలో పాలుపంచుకున్న ఉద్యోగుల వివరాలు సేకరించారు. అక్రమార్కులును జైలుకు పంపుతామని కేసీఆర్ ప్రకటించడం.. సీబీసీఐడీ దూకుడు పెంచడంతో ‘ఇంటి’ దొంగల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇందిరమ్మ పథకం మూడు విడతల్లో జిల్లాకు 3,16,538 ఇళ్లు మంజూరయ్యాయి. ఇప్పటివరకు 1,78,491 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా, 71,188 ఇళ్లు వివిధ కారణాలతో చివరి దశలో పనులు నిలిచిపోయాయి. 39,336 ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉండగా, 27,523 ఇళ్లు ఇంకా ప్రారంభం కాలేదు.
హౌసింగ్ లెక్క
రూ.18.50 కోట్లే..
జిల్లావ్యాప్తంగా గృహనిర్మాణాల్లో రూ.70 కోట్ల మేర దుర్వినియోగమైనట్టు తెలుస్తోంది. కానీ.. గృహనిర్మాణ శాఖ విచారణలో జిల్లాలోని 42 గ్రామాల్లో 794 ఇళ్లలో అవినీతి జరిగిందని తేల్చారు. ఇప్పటివరకు రూ.18.5 కోట్లు పక్కదారి పట్టినట్టు నిర్దారించారు. అందులో రూ.22.90 లక్షలు మాత్రమే అక్రమార్కుల నుంచి రికవరీ చేశారు. అవినీతిలో హౌసింగ్ శాఖలో రెగ్యులర్‌గా పనిచేస్తున్న ఆరుగురు డెప్యూటీ ఈఈలు, 36 మంది ఏఈలు, ఒక సీనియర్ అసిస్టెంట్ ఉన్నారు. ఇతర శాఖల నుంచి ఆరుగురు ఎంపీడీవోలు, ఇద్దరు తహశీల్దార్లు ఉండగా, 12 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, 93 మంది అనధికార సిబ్బంది ఉన్నారు. క్రిమినల్ కేసులున్న వారిలో ఆరుగురు అధికార సిబ్బంది, 33 మంది అనధికార సిబ్బంది ఉన్నారు.
వీరిలో సస్పెండ్ అయిన వారిలో ముగ్గురు డెప్యూటీ ఈఈలు, 16 మంది ఏఈలు, ఇతరులు ఇద్దరున్నారు. ఇద్దరు వర్క్ ఇన్‌స్పెక్టర్లను పూర్తిస్థాయిలో తొలగించారు. సస్పెండ్ అయిన వారిలో తిరిగి 18 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఈ చిట్టాను సీబీసీఐడీ సేకరించింది. ఈ క్రమంలో హౌస్‌హోల్డ్ సర్వేను చేపట్టేందుకు సర్కారు నిర్ణయించింది. శుక్రవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో హౌస్‌హోల్డ్ సర్వేపై సమావేశం జరగనుంది. ఇన్‌చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ఆర్డీవోలు, డెప్యూటీ కలెక్టర్లు, తహశీల్దార్లు సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో సర్వేతో పాటు భూపంపిణీ, ‘ఫాస్ట్’ కమిటీ, రేషన్ కార్డులపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు సమాచారం.
సిబీసీఐడీ దూకుడు
Published Fri, Aug 1 2014 3:16 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM
Advertisement