* దురుద్దేశంతోనే ఇతర బ్యాంకుల నుంచి రుణాలు
* హైకోర్టుకు కెనరా బ్యాంకు నివేదన
సాక్షి, హైదరాబాద్: రుణాల పేరుతో కెనరా బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో హైదరాబాద్ చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్న దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ చైర్మన్ టి.వెంకట్రామిరెడ్డిని సీబీఐ అధికారులు బుధవారం కస్టడీలోకి తీసుకున్నారు. కోఠిలోని సీబీఐ కార్యాలయంలో విచారించి సాయంత్రం 5.30కు తిరిగి జైలుకు తరలించారు. ఈ కేసులో జైల్లో ఉన్న మరో నిందితుడు వినాయక రవిరెడ్డికి మంగళవారం విచారణ సమయంలో ఛాతీ నొప్పి రావడంతో సీబీఐ అధికారులు ఆయనను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్చడం తెలిసిందే. ఆరోగ్యం కుదటపడటంతో బుధవారం ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరోవైపు... వెంకట్రామిరెడ్డి, వినాయక్ రవిరెడ్డి తమ నుంచి రుణం పొందేందుకు తాకట్టు పెట్టిన ఆస్తులనే తమకు చెప్పకుండా మరో బ్యాంకుకు సైతం తాకట్టు పెట్టి అక్కడా రుణాలు పొందారని హైకోర్టుకు కెనరా బ్యాంకు నివేదించింది.
వెంకట్రామిరెడ్డి, వినాయక్ రవిరెడ్డిలపై కేసులను కొట్టేయాలని కోరుతూ వారి సతీమణులు టి.మంజులారెడ్డి, టి.శాంతి ప్రియదర్శినిరెడ్డి హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. కోర్టు ఆదేశం మేరకు కెనరా బ్యాంకు చీఫ్ మేనేజర్ ఎం.చంద్రశేఖరరెడ్డి బుధవారం దానిపై కౌంటర్ దాఖలు చేశారు. బ్యాంకుల నుంచి తీసుకున్న ఈ రుణాలను కంపెనీ ఆస్తి అప్పుల పట్టీలో చూపలేదని ఆరోపించారు. ‘‘పైగా దాని ఆర్థిక పరిస్థితి బాగున్నట్లు చూపారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేశారు. ఇది విశ్వాసఘాతుకమే. వారి చర్యలు ప్రజాద్రోహం కిందకు వస్తాయి. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై ఉన్న కేసులను కొట్టేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది’’ అని అందులో పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సీబీఐ లోతుగా దర్యాప్తు జరిపితే తప్ప వాస్తవాలు వెలుగులోకి రావన్నారు. మంజులారెడ్డి, శాంతి ప్రియదర్శినిరెడ్డిల పిటిషన్‌ను కొట్టేయాలని కోర్టును అభ్యర్థించారు.
డీసీ చైర్మన్‌ను విచారించిన సీబీఐ
Published Thu, Feb 26 2015 2:08 AM | Last Updated on Tue, Aug 27 2019 4:30 PM
Advertisement
Advertisement