
నిఘా నీడలో మంచిర్యాల
ప్రధాన కూడళ్లలో 27 సీసీ కెమెరాలు
అత్యాధునిక ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలతో నిఘా
రాత్రి వేళల్లోనూ స్పష్టంగా రికార్డు
పోలీస్‌స్టేషన్ కంట్రోల్ రూంలో పర్యవేక్షణ
మంచిర్యాల టౌన్ : తూర్పు జిల్లా కేంద్రంగా పేరొందిన మంచిర్యా లలో నేరాల నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై పోలీసు శాఖ దృష్టి సారించింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణంకావడంతో పాటు వ్యాపార పరంగా, కోల్‌బెల్ట్ ప్రాంతం విస్తరించింది. పోలీసు వ్యవస్థను పటిష్టం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఎక్కడ ఎలాంటి నేరాలు జరిగినా తక్షణమే స్పందించేలా పట్టణం మొత్తంగా నిఘా నీడలోకి చేరింది.
జిల్లా ఎస్పీ తరుణ్‌జోషి ఆదేశాల మేరకు మంచిర్యాల ఏఎస్పీ ఎస్‌ఎం.విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలోని 27 ప్రధాన కూడళ్లలో అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇందుకోసం సుమారు రూ.40లక్షల వరకు వెచ్చించారు. ఆధునిక టెక్నాలజీతో కూడిన ఇన్‌ఫ్రారెడ్ టెక్నాలజీ సీసీ కెమెరాలు 27 ఏర్పాటు చేశారు. వీటి ద్వారా వంద మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అరుున వెంటనే గుర్తించి పరిష్కరించవచ్చు. రాత్రి వేళల్లోనూ దృశ్యాలను స్పష్టంగా చిత్రీకరిస్తారుు. నేరస్తులను గుర్తించడానికి, ఏదైనా సంఘటన జరిగిన వెంటనే నేరస్తులను పట్టుకోవడానికి ఈ కెమెరాలు ఉపయోగపడుతారుు. త్వరలో జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌లో 15 కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.
నిరంతర నిఘా
మంచిర్యాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడమే కాకుండా వాటి పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా పోలీసుస్టేషన్‌లో ప్రత్యేకంగా కంట్రోలక్ష రూం ఏర్పాటు చేస్తున్నారు. క్రైం, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగాల నుంచి పోలీస్ సిబ్బందిని కంట్రోల్ రూం బాధ్యులుగా నియమిస్తారు. ఆయూ విభాగాల సిబ్బంది కోణంలో సీసీ కెమెరాల దృశ్యాలను విశ్లేషిస్తుంటారు. రైల్వేస్టేషన్, బస్టాండ్ ఏరియా, బెల్లంపల్లి చౌరస్తా, ముఖరం చౌరస్తా, బైపాస్‌రోడ్, ఏసీసీ చౌరస్తా, ఓవర్‌బ్రిడ్జి ఏరియా, ఐబీ ఏరియా, మార్కెట్‌రోడ్, గంగారెడ్డిరోడ్, వాటర్‌ట్యాంక్ చౌరస్తా, కాలేజ్‌రోడ్‌తోపాటు గోదావరి తీరంలో కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలు నిరంతరం 360 డిగ్రీల్లో తిరుగుతూ ప్రతీ దృశ్యాన్ని రికార్డు చేస్తారుు. నేరాలపైనే కాకుండా ట్రాఫిక్ సమస్యలపై నిఘా పెడుతూ విధుల్లో ఉన్న ట్రాఫిక్, పోలీస్ సిబ్బందికి కంట్రోల్ రూం ద్వారా ఆదేశాలు జారీ చేస్తూ పరిస్థితులను అదుపు చేసేలా కార్యాచరణ ఉంటుంది.
పుష్కరాల్లో కీలకం
జూలై 14 నుంచి మంచిర్యాల గోదావరి తీరంలో జరిగే పుష్కరాల్లో సీసీ కెమెరాలో కీలక పాత్ర పోషించనున్నారుు. నేరాలు, చెదురు మదురు సంఘటనలు జరగకుండా ప్రత్యేక బందోబస్తు చర్యలు ఇక పటిష్టం కానున్నాయి. పుష్కరాలు జరిగే గోదావరి తీర ప్రాంతంలోనూ ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటును మరోసారి పరిశీలించి అవసరమైతే అదనంగా కెమెరాలు ఏర్పాటు చేస్తామని సీఐ సురేశ్ తెలిపారు.
కంట్రోల్ రూంకు అదనపు బాధ్యతలు
ఏదైనా వాహనం చోరీకి గురైతే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే చాలు. వెంటనే ఆ చోరీ ఎలా జరిగింది, ఎక్కడ, ఏ ప్రాంతంలో జరిగింది అనే అంశాలపై వెంటనే కంట్రాల్ రూం సిబ్బందిని కలిస్తే సరిపోతుంది. అక్కడ ఉండే ఎల్‌సీడీ స్క్రీన్‌ల ద్వారా వాహనం పార్కింగ్ చేసిన ప్రాంతం నుంచి ఎక్కడెక్కడికి వెళ్లింది అనీ సీసీ కెమెరాలు రికార్డింగ్ చేసిన దృశ్యాలను పరిశీలించవచ్చు. వాహనం, దొంగ ఇట్టే దొరికిపోయే అవకాశాలు ఉన్నాయి.