
సెల్ ఫోన్ రేడియేషన్
సాక్షి, హైదరాబాద్ : యువతను సెల్‌భూతం పట్టిపీడిస్తోంది. చేతిలో పెద్ద అణుబాంబుగా తయారైంది. అవసరం లేకపోయినా సెల్‌ఫోన్‌లో ఎక్కువ సేపు మాట్లాడటం.. గంటల తరబడి ఫేస్‌బుక్, వాట్సాప్ గ్రూప్‌లో చాటింగ్స్ చేయడం...రాత్రంతా ఫోన్‌ను పక్కన పెట్టుకుని యూటూబ్‌లో వీడియోలు వీక్షించడం వల్ల అనేక రకాల ఎలర్జీ సమస్యలు తలెత్తుతున్నట్లు హైదరాబాద్‌లోని అశ్వినీ ఎలర్జీ సెంటర్ సర్వేలో తేలింది. ఇందుకోసం దాదాపు వంద మందిపై పరిశోధన చేశారు. వీరిని నాలుగు వారాల పాటు సెల్ ఫోన్ వినియోగానికి దూరంగా ఉంచి శారీరకంగా, మానసికంగా చోటు చేసుకున్న మార్పులను పరిశీలించారు.
ఎన్నో సమస్యలు..
సెల్‌ఫోన్ వాడేవారిలో తలనొప్పి, ఏకగ్రాతను కోల్పోవడం, చికాకు, ముక్కు, కంటి నుంచి నీరు కారడం వంటి ఎలర్జీలను గుర్తించారు. ఫోన్‌కవర్ తయారీలో వాడే నికెల్ రసాయనంతోపాటు సెల్ ఫోన్ నుంచి వెలువడే రేడియేషనే ప్రధాన కారణమని గుర్తించారు. ఈ మేరకు గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ ఈ పరిశోధనా ఫలితాలు వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం..
దెబ్బతింటున్న చర్మం..
సెల్‌ఫోన్ వాడకం వల్ల చర్మంపై పగుళ్లు ఏర్పడుతుండగా, నిత్యం స్క్రీన్‌పై చేతివేళ్లు టచ్ చేస్తుండటం వల్ల అవి స్పర్శను కోల్పొతున్నారు. బాధితుల్లో 40 శాతం మంది ఎలర్జీ రైనటీస్(ముక్కు నుంచి నీరు కారడం, ముక్కు బిగుసుకు పోవడం)తో బాధపడుతుంటే, 10 నుంచి 15 శాతం మంది ఎటోపిక్ ఆస్తమా(శ్వాస నాళాలు మూసుకు పోవడం)తో బాధపడుతున్నారు. సెల్‌ఫోన్ నుంచి వెలువడే రేడియేషన్ వల్ల ఫేస్‌మేకర్ అమర్చుకున్న హృద్రోగులకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
పిల్లలపై తీవ్ర ప్రభావం...
హైదరాబాద్ నగరంలో 1.20 కోట్ల జనాభా ఉండగా.. వీరిలో కోటి మందికిపైగా సెల్‌ఫోన్స్ వినియోగిస్తున్నట్లు ఓ అంచనా. వీరిలో పిల్లలు కూడా ఉంటున్నారు. అవలీలగా పిల్లలు సెల్‌ఫోన్ ఆపరేటింగ్ చేస్తున్నాడని చాలా మంది తల్లిదండ్రులు ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. వాళ్లు ఆపరేట్ చేస్తుంటే చెప్పుకొని మురిసిపోతుంటారు. నిజానికది చాలా ప్రమాదం. పిల్లల సున్నితమైన శరీరంపై సెల్‌ఫోన్ రేడియేషన్ తీవ్రమైన ప్రభావం చూపుతుంది. మొబైల్ కవర్స్ తయారీలో నికెల్ రసాయనంతో కూడిన పూత రాస్తుంటారు.
సెల్‌పోన్‌ను చెవులవద్ద, దవడ భాగంలో పెట్టుకుని మాట్లాడడం వల్ల చెవిపోటు, వినికిడి సమస్యతోపాటు దురద, దద్దుర్లు, తలనొప్పి, ముక్కుకారడం, ఆయాసం, చర్మం పొడిబారటం, వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. కొంత మంది తాము చాలా ఖరీదైన ఫోన్ వాడుతున్నాం కాబట్టి తమకు ఎలాంటి రేడియేషన్ సమస్యలు ఉండవని భావిస్తుంటారు. నిజానికి అది తప్పు. ఎంతటి ఖరీదైన ఫోనైనా రేడియేషన్ తప్పదు. సెల్ టవర్ల నుంచి వెలువడే రేడియేషన్ కేవలం ప్రజారోగ్యంపైనే కాకుండా పక్షులు, పిచ్చుకలు, తేనేటీగలు, తుమ్మెదలు వంటి చిరు జీవులపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.
ఈ సూచనలు పాటించండి..
సెల్ ఈజ్ హెల్ అని తేలిపోయినప్పటికీ..ప్రస్తుతం ఇది జీవితంలో భాగమైంది. ప్రస్తుతం దీన్ని వాడకుండా ఉండలేని పరిస్థితి నెలకొంది. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే, ఈ ముప్పు నుంచి కొంత వరకు బయటపడొచ్చు. నిరవధికంగా ఎనిమిది గంటల పాటు ఫోన్ మాట్లాడే వారికి చెవుడు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. రెండు మూడు నిమిషాలకు మించి సెల్‌ఫోన్‌లో మాట్లాడరాదు. సాధ్యమైనంత వరకు ఎస్‌ఎంఎస్ చేయడం అలవాటు చేసుకోవాలి. వైర్‌లెస్ హెడ్ ఫోన్స్, బ్లూటూత్స్ వాడటం ఉత్తమం. చెవికి ఫోన్ దూరంగా ఉంచి మాట్లాడాలి. కారు నడుపుతున్నప్పుడు కానీ, బండి నడుపుతున్నపుడు కానీ సెల్ ఫో న్ యూజ్ చేయకూడదు. లౌడ్ స్పీకర్‌ను ఆన్ చేసి మాట్లాడ కూడదు. పడుకునేప్పుడు సెల్ ఫోన్ తల దగ్గర పెట్టుకోవద్దు.
– డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్‌రావు, అశ్విని ఎలర్జీ సెంటర్