ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో లాక్‌డౌన్ కొన సాగుతుండటం, మరిన్ని రోజులు దీన్ని కొనసాగించనున్న నేపథ్యంలో నిత్యావసర వస్తువుల లభ్యత పెంచడం, ధరల నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. నిత్యావసరాల ధరలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వీటిని ఉపేక్షించి అధిక ధరలకు అమ్మే వారిపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కృత్రిమ కొరత, బ్లాక్ మార్కెటింగ్ చేసే వ్యాపారులపై క్రిమినల్ కేసులు పెట్టడంతో పాటు, ఏడేళ్ల పాటు జైలుకు పంపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.ఈ మేరకు కేంద్ర హోం సెక్రటరీ అజయ్ కుమార్ భల్లా, వినియోగదారుల మంత్రిత్వశాఖ కార్యదర్శి పవన్ అగర్వాల్ రాష్ట్రాలకు లేఖలు రాశారు.
పప్పులు, నూనెల ధరల్లో అనూహ్య పెరుగుదల..
దేశవ్యాప్తంగా గత నెల చివరి వారం వరకు ధరలు నియంత్రణలోనే ఉన్నా, ఈ నెల తొలి వారం నుంచి సరుకుల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి.రాష్ట్రంలో కూరగాయలు, పండ్ల ధరలు గతానికన్నా తగ్గినా, పప్పులు, నూనెల ధరలు అమాంతం పెరుగుతున్నాయి. కిందటి నెలలో కందిపప్పు ధర కిలో రూ.75 నుంచి రూ.85 మధ్యలో ఉండేది. ప్రస్తుత డిమాండ్ నేపథ్యంలో మేలురకం కందిపప్పు ధర రూ.120 నుంచి రూ.130కి చేరింది. దేశంలో పప్పుధాన్యాల దిగుబడిలో అధిక వాటా కలిగిన కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌ల నుంచి రాష్ట్రానికి సరఫరా తగ్గుతోంది. వాహనాల రాకపోకలకు ఆటంకాలు, సిబ్బంది కొరతతో అక్కడి నుంచి సరఫరా ఆగడంతో ధరలు పెరిగాయి. పెసర, మినపపప్పు ధరలు సైతం ఇంతకింతకీ పెరుగుతున్నాయి.సరఫరాలో తగ్గుదల కారణంగా ప్రస్తుతం ధరల పెరుగుదల 20% నుంచి 25% వరకు ఉంది. పెసర పప్పు ధర వారం కింద రూ.85 వరకు ఉండగా, అది ప్రస్తుతం రూ.130–140కి చేరింది. మినపపప్పు ధర సైతం కిలో రూ. 130–135కిపైనే ఉంది. ఇక వంట నూనెల ధరలు సైతం 15 నుంచి 20% పెరిగాయని వినియోగదారుల మంత్రిత్వశాఖే చెబుతోంది.
సప్‌లై చైన్ వ్యవస్థ దెబ్బతినడంతో ఇష్టారీతిన ధరలు పెంచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తోంది.లీటర్ పామాయిల్ ధర రూ.90 ఉండగా, అది ఇప్పుడు రూ.110–120కి చేరింది. ఈ దృష్ట్యా పప్పులు, నూనెల ధరలను నియంత్రించాలని వినియోగదారుల మంత్రిత్వ శాఖ, కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు ఆదేశించింది. ముఖ్యంగా నిల్వలపై పరిమితులు విధించడం, ధరలు తగ్గించడం, డీలర్ల ఖాతాల తనిఖీలు చేపడుతూనే నిత్యావసర సరుకుల చట్టం కింద బ్లాక్‌మార్కెట్ చేసే వారిపై క్రిమినల్ కేసులు, ఏడేళ్ల జైలు శిక్షలు విధించాలని సూచించింది. దీనికై రాష్ట్ర యంత్రాంగాలు విస్తృత తనిఖీలు చేపట్టి అరెస్ట్‌లు చేయాలని కోరింది. ఇప్పటికే ఆహార ధాన్యాల రవాణాను పెంచే క్రమంలో 109 ప్రత్యేక రైళ్ల ద్వారా రైల్వే శాఖ 21,247 వ్యాగన్ల ద్వారా ఉప్పు, చక్కెర, వంటనూనెలు, కంది, బియ్యం వంటి సరుకుల రవాణా చేసిందని, సరుకుల కొరత రాకుండా అన్ని రాష్ట్రాలకు సరఫరా చేస్తోందని ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment