గోవధ నిషేధం ఓ సంస్కరణ: కేంద్రమంత్రి నక్వీ
- కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ
హైదరాబాద్: గోవధ నిషేధంపై కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ స్పందించారు. గోవధను మతపరంగా కాకుండా సంస్కరణగా చూడాలని ఆయన అన్నారు. బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడూతూ..పశువుల మార్కెట్లను క్రమబద్దీరించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. దీనికి అందరూ సహరించాలని కోరారు. దేశంలో సమాఖ్య వ్యవస్థ ఉందని, కానీ కొన్ని రాష్ట్రాలు ఈ చట్టాన్ని అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఫ్ పార్టీల పేరుతో కొందరు గోవధ అంశాన్ని రాజకీయంగా రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది దేశంలో సామరస్యతను దెబ్బతీస్తుందని చెప్పారు. ఇలాంటి చర్యలను ప్రభుత్వం సహించదన్నారు. గోవధ సెంటిమెంట్‌తో ముడిపడి విషయమని, గోవధ నేరమని తెలిపారు.
మోదీ నాయకత్వంలో ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా భారతఖ్యాతిని పెంచిందని, కశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్‌ను ప్రపంచ దేశాల్లో ఏకాకి చేశామని వివరించారు. దేశంలో 80 నుంచి 90 శాతం మతపరమైన ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయని వెల్లడించారు. తెలంగాణలో బీజేపీ అవసరం ఎక్కువగా ఉందని, బీజేపీకి తెలంగాణ చాలా ముఖ్యమైనదని అన్నారు. 2019 లో రాష్ట్రంలో బీజేపీ పూర్తి మెజారిటీ తో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు. తాయిలాలు లేకుండానే మైనార్టీల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. యూపీలో ముస్లింల ఓటర్ల పై రవిశంకర్ వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు అమలు చేయడం రాజ్యాంగం ప్రకారం సాధ్యం కాదని, ఇవి ఎన్నికల కోసం వేసే ఎత్తులు మాత్రమేనని స్పష్టం చేశారు.