సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు ముగ్గురు కేంద్ర మంత్రులు బుధవారం నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. కేంద్ర పట్టణాభివద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి మోహనభాయి కందారియాతో పాటు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ ఈ పర్యటనలో పాల్గొననున్నారు. నల్లగొండ జిల్లాకు వెళ్లి జరిగిన పంటనష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి, అందించాల్సిన సాయంపై అధికారులతో చర్చించనున్నారు.
అలాగే ఈనెల 16, 17 తేదీల్లో రాష్ట్రానికి చెందిన బీజేపీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులతో కూడిన బృందం పంటనష్టాన్ని పరిశీలించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనుందని బీజేపీ కార్యాలయ కోఆర్డినేటర్ దాసరి మల్లేశం తెలిపారు. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా పంటలను కోల్పోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు డాక్టర్ లక్ష్మణ్ ముఖ్యమంత్రికి లేఖరాశారు.