అమ్మపై కత్తి కాసుల కక్కుర్తి | Cesarean deliveries are high in the state | Sakshi
Sakshi News home page

అమ్మపై కత్తి కాసుల కక్కుర్తి

Published Mon, Aug 26 2019 3:09 AM | Last Updated on Mon, Aug 26 2019 3:09 AM

Cesarean deliveries are high in the state - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అమ్మకు కడుపుకోత తప్పడం లేదు. ప్రసవాల సందర్భంగా గర్భిణులకు సిజేరియన్‌ చేయడం మామూలు విషయంగా మారింది. అవసరమున్నా లేకున్నా అనేకమంది డాక్టర్లు ఇష్టారాజ్యంగా సిజేరియన్లు చేస్తుండటంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. సిజేరియన్‌ ఆపరేషన్లు చేసి ఆస్పత్రులు వేలకువేలు గుంజుతున్నాయి. కార్పొ రేట్‌ ఆసుపత్రుల్లో ఏకంగా లక్షలకు లక్షలు లాగుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖ తాజాగా ప్రభుత్వానికి పంపిన నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాల్లో 60 శాతం సిజేరియన్‌ ద్వారానే జరుగుతున్నట్లు తేలింది. అందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 44 శాతం, ప్రైవేటు ఆసుపత్రుల్లో 56 శాతం ప్రసవాలు సిజేరియన్‌ ద్వారానే జరిగినట్లు నిర్ధారించింది. సాధారణ పద్ధతిలో ప్రసవాలు చేయడానికి అవకాశమున్నా కడుపుకోత మిగుల్చుతున్నారు.  

నిర్మల్‌లో అధికం.. కొమురంభీం అత్యల్పం 
నిర్మల్‌ జిల్లాలో ఈ ఏడాది జరిగిన 7,337 ప్రసవాల్లో 6,040 (82%) సిజేరియన్‌ ద్వారానే జరిగినట్లు తేలింది. హైదరాబాద్‌లో ఈ ఏడాది జరిగిన 72, 449 ప్రసవాల్లో 38,758 సిజేరియన్‌ ద్వారానే జరిగాయి. అత్యల్పంగా కొమురంభీం జిల్లాలో 22% సిజేరియన్లు జరిగాయి. అక్కడ జరిగిన 3,342 ప్రసవాల్లో 730 మాత్రమే సిజేరియన్లు జరిగాయి. ఈ జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోంది.  


కాసులే పరమావధి... 
సిజేరియన్‌ ద్వారా బిడ్డను బయటకు తీయడం సర్వసాధారణమైంది. సాధారణ ప్రసవమా? సిజేరియన్‌ చేయాలా అన్నది గర్భిణీని ముందునుంచీ పరీక్షించే డాక్టర్‌కు అర్థమైపోతుంది. అత్యంత రిస్క్‌ కేసుల్లో మాత్రమే సిజేరియన్‌ అవసరమవుతుంది. నెలల ముందే దీనిపై స్పష్టత వస్తుంది. సాధారణ ప్రసవం అయితే రెండ్రోజుల్లో ఇంటికి పంపించేయవచ్చు. సిజేరియన్‌ అయితే వారం వరకు ఆసుపత్రిలో ఉంచుకోవచ్చు. సాధారణ ప్రసవానికి ప్రైవే టు ఆసుపత్రుల్లో రూ.25 వేలతో ముగించేయవచ్చు. సిజేరియన్‌ అయితే ఆసుపత్రి స్థాయిని బట్టి రూ. 50 వేల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఒక ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రిలో రూ. 5 లక్షలు వసూలు చేస్తుండటం తెలిసిందే. కొందరు డాక్టర్లు సెంటిమెంట్‌ను కూడా క్యాష్‌ చేసుకుంటున్నారు. ముహూర్తం ప్రకారం సిజేరియన్‌ చేసి బిడ్డను బయటకు తీస్తున్నారు. సిజేరియన్‌ వల్ల తల్లికి మున్ముందు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలొచ్చే అవకాశం ఉంటుంది.
  
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరిగిన ప్రసవాలు 
తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్‌ కిట్‌ పథకం కింద ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం చేయించుకునే గర్భిణులకు రూ. 12 వేల చొప్పున అందజేస్తుంది. ఆడబిడ్డ పుడితో మరో వెయ్యి అదనం. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయి. ప్రస్తుత నివేదిక ప్రకారం మొత్తం ప్రసవాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 57% జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగినా, ఇటీవల గర్భిణులకు ప్రోత్సాహకపు సొమ్మును అధికారులు పెండింగ్‌లో పెట్టడంతో మహిళల్లో నిరాశ నెలకొంది. దాదాపు ఆరు నెలల నుంచి ప్రోత్సాహకాలు నిలిచిపోయాయని చెబుతున్నారు. అధికారులు కూడా దీన్ని ధ్రువీకరిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement