'రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల స్థాయి పెంపు'
ఆదిలాబాద్: రాష్ట్రంలో ఆరు పడకల ఆస్పత్రి స్థాయిని 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీహెచ్ లక్ష్మారెడ్డి వెల్లడించారు. అలాగే ఏరియా ఆస్పత్రులను 100 పడకల ఆస్పత్రులు మారుస్తామన్నారు. జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులను వెయ్యి పడకల ఆస్పత్రులుగా ఏర్పాటు చేస్తామన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో రూ.10 కోట్లతో నిర్మించిన ఏరియా ఆస్పత్రిని మంత్రులు సీహెచ్ లక్ష్మారెడ్డి, ఎన్. ఇంద్రకరణ్ రెడ్డిలు ప్రారంభించారు.
అనంతరం లక్ష్మారెడ్డి మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో రాష్ట్రంలో వైద్య సేవలు క్షీణించాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి... టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య సేవలు మెరుగయ్యాయన్నారు. భవిష్యత్తులో రాష్ట్రంలో వైద్య సేవలను మరింత మెరుగు పరుస్తామని లక్ష్మారెడ్డి తెలిపారు.