తవ్వుకో.. అమ్ముకో! | Chalk mines Dig .. sell | Sakshi
Sakshi News home page

తవ్వుకో.. అమ్ముకో!

Published Wed, Mar 18 2015 7:42 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

Chalk mines Dig .. sell

పెద్దేముల్: అనుమతి లేకున్నా అక్రమంగా తవ్వకాలు.. ఆపై అధికారుల అండదండలు.. సహజ సంపదను కొల్లగొట్టే ఘనులకు ఇంకేం కావాలి. సరిగ్గా జిల్లా పశ్చిమ ప్రాంతంలో సుద్దగనుల తరలింపులో ఇదే తంతు జరుగుతోంది. ప్రభుత్వ అనుమతులు లేనప్పటికీ ఎకరాలకొద్దీ ప్రభుత్వ, అటవీ భూముల్లో అక్రమంగా సుద్దను తవ్వేస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తతంగం అధికార గణానికి తెలిసినప్పటికీ.. లోపాయికారీ ఒప్పందంతో చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. దీంతో సర్కారుకు కోట్ల రూపాయలు నష్టం కలుగుతుండగా.. అక్రమార్కులకు, స్థానిక అధికారులకు మాత్రం కాసుల పంట కురిపిస్తోంది.
 

జిల్లా పశ్చిమ ప్రాంతమైన పెద్దేముల్, ధారూరు, మోమిన్‌పేట్ మండలాల్లో సుద్దగనులు పుష్కలంగా ఉన్నాయి. వీటిపై కన్నేసిన స్థానిక నాయకులు కొందరు అక్రమంగా సుద్ద, ఎర్రరాయిని తవ్వేస్తూ ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వ అనుమతి తీసుకుని మైనింగ్ చేపడితే సర్కారు ఖజానాకు ఆదాయం సమకూరేది. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలకు ఉపక్రమించిన అక్రమార్కులు.. దాదాపు 10వేల టన్నుల సుద్దను తోడేశారు. మారుపల్లి, రుద్రారం, తట్టేపల్లి, ఓగులాపూర్ తదితర గ్రామాల్లో పెద్ద ఎత్తున తవ్వకాలు జరిపినట్లు స్పష్టమవుతోంది.


స్థానికులే సూత్రధారులు..
సుద్ద, ఎర్రరాయి అక్రమ తవ్వకాల్లో స్థానికుల పాత్ర అధికమని తెలుస్తోంది. ఆయా గ్రామాల్లోని కొందరు వ్యక్తులే ఈ తవ్వకాలు జరుపుతున్నదనేది బహిరంగ రహస్యం. ఈ తంతు గనుల శాఖ అధికారులకు తెలిసినప్పటికీ చూసీచూడనట్లు వదిలేస్తుండడంతో తవ్వకాల వ్యవహారం సాఫీగా సాగుతోంది. ఇలా రోజుకు 30 నుంచి 40 లారీల సుద్దను తోడేస్తున్నట్లు తెలుస్తోంది.


రాయల్టీకి ఎగనామం..
గనుల తవ్వకాల్లో ప్రభుత్వానికి గరిష్టంగా మూడోవంతు రాయల్టీ రూపంలో చెల్లించాలి. కానీ ప్రభుత్వ అనుమతులు లేకుండానే తవ్వకాలు జరుపుతుండడంతో ఖజానాకు భారీగా నష్టం వాటిల్లుతోంది. ఇటీవల మారేపల్లి గ్రామంలో సర్వే నంబర్ 170లో పెద్ద ఎత్తున తవ్వకాలు జరిపి టన్నులకొద్దీ సుద్దను మాయం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. వాస్తవానికి సుద్ద తవ్వకాలకు సంబంధించి టన్నుకుగాను ప్రభుత్వానికి రూ.110 చెల్లించాలి. అదేవిధంగా ఆఫ్ వైట్ సుద్దకు రూ.44 ఇవ్వాలి. కానీ ఈ సొమ్ము సర్కారు ఖాతాలో జమకాకపోవడంతో భారీ నష్టమే జరుగుతోంది. రోజుకు గరిష్టంగా రూ.2లక్షలు.. నెలలో రూ.60 లక్షల రెవెన్యూ నష్టం జరుగుతున్నట్లు అంచనా.


వారిపై చర్యలేవీ..?
సుద్ద తవ్వకాలపై ఫిర్యాదులందడంతో ఇటీవల అధికారులు దాడులు జరిపారు. దీంతో మారేపల్లిలో 1500 టన్నుల విలువైన సుద్దను పట్టుకున్నారు. కానీ అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఆ తర్వాత మరో 5వేల టన్నుల సుద్ద అక్రమంగా తరలించినప్పటికీ అధికారుల మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. రుద్రారం, గోపాల్‌పూర్ గ్రామాల్లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నా అధికారులు మాత్ర అటువైపు చూడడం లేదు. ఇందోల్ గ్రామంలో పేదలకిచ్చిన అసైన్డ్ భూముల్లో పెద్ద ఎత్తున తవ్వకాలు చేపడుతున్నారు. యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement