
చంద్రబాబును ఏ1 దోషిగా చేర్చాలి
హన్మకొండ: ఎమ్మెల్యేలకు లంచాలు ఇవ్వజూపిన కేసులో టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబును ఏ1 దోషిగా చేర్చాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. హన్మకొండలో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర హోం మంత్రిని కలసి చంద్రబాబును ఈ కేసులో ఏ1గా చేయాలని కోరారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలతోపాటు దేశవ్యాప్తంగా ప్రజలు ఇదే కోరుతున్నారని కవిత పేర్కొన్నారు. రేవంత్‌ను నడిపించిన చంద్రబాబును కచ్చితంగా దోషిగా చూడాలని కవిత అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వంపై ఉల్టా కేసులు పెట్టాలని ఆంధ్రా ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు.
చిన్న చిన్న అంశాలకు సీబీఐ విచారణ చేయాలని కోరే చంద్రబాబు ఈ అంశంలో ఎందుకు మౌనంగా ఉన్నారో రెండు రాష్ట్రాల ప్రజలకు సమాధానం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. తాము వారి ఎమ్మెల్యేలపై నిఘా పెట్టినట్లు.. ఫోన్లు ట్యాపింగ్ చెస్తున్నట్లు ఎల్లో మీడియాలో వార్తలు వస్తున్నాయని, వీటిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పదవుల ఆశచూపి తాము ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడం లేదని స్పష్టం చేశారు. పదవుల కంటే నాయకులు రాజకీయ భవిష్యత్ చూసుకుంటారని, కేసీఆర్ పాలన చూసిన తర్వాత భవిష్యత్తులో గులాబీ జెండా ఒక్కటే ఉంటుందని.. దీని నీడలో చేరడానికి ముందుకు వస్తున్నారన్నారు. తెలంగాణలో ఆంధ్ర పార్టీల.. పచ్చ పార్టీల కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయని, ఈ కుట్రలు తిప్పికొట్టడానికి ఇంటి పార్టీ బలపడాల్సిన అవరసరముందున్నారు. కేంద్ర ప్రభుత్వంలో చేరే ఆలోచన లేదని చెప్పారు. కేబినెట్ మంత్రిగా ఎప్పుడు చూడవచ్చని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె మౌనంగా ఉండిపోయారు.