
బిల్లు ఆమోదం వెనుక బాబు, వెంకయ్యల కుట్ర
జేఏసీ జిల్లా చైర్మన్ వెంకటేశ్వర్లు ధ్వజం
నల్లగొండ అర్బన్: పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపొద్దని తెలంగాణ సమాజమంతా ఉద్యమాలు కొనసాగిస్తుంటే పార్లమెంట్‌లో అందుకు సంబంధించిన బిల్లును ఆమోదించి కేంద్రం అత్యుత్సాహం ప్రదర్శించిందని జేఏసీ జిల్లా చైర్మన్ జి.వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. బిల్లు ఆమోదం వెనుక చంద్రబాబునాయుడు, వెంకటయ్యనాయుడుల కుట్ర ఉన్నదని ఆయన ఆరోపించారు. బిల్లుకు నిరసనగా పట్టణంలోని రామగిరి సెంటర్‌లో శుక్రవారం రాత్రి జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ గతంలో తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి చట్టం చేయడం బాధాకరమన్నారు. ఆంధ్రాప్రాంతం వారి ప్రయోజనాల కోసం 3లక్షల మంది గిరిజనుల హక్కులను కేంద్రం కాలరాసిందని ఆరోపించారు. కేంద్రం గిరిజనుల హక్కులను హరిస్తూ వారికి తీరని ద్రోహం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో వేణుసంకోజు, సోమయ్య, జవహర్‌లాల్, విజయ్‌కుమార్, పిచ్చయ్య, శ్రీనివాస్, దేవేందర్, సైదులు, సాగర్, రవి, రమేష్, సోమమల్లయ్య, సిహెచ్. రామరాజు, సంతోష్‌రెడ్డి పాల్గొన్నారు.
బంద్‌కు టీజేఏసీ మద్దతు
పోలవరం బిల్లును వ్యతిరేకిస్తూ శనివారం తలపెట్టిన బంద్‌కు టీజేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు టీజేఏసీ చైర్మన్ జి. వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. బంద్ విజయవంతానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు.
విద్యార్థి సంఘాలు..
తెలంగాణ రాష్ట్ర బంద్‌కు మద్దతు ప్రకటిస్తున్న పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు ఇందూరు సాగర్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కోట రమేష్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి జి. రాజారాం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా విద్యార్థి లోకం, యువకులు పెద్ద ఎత్తున ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు.