ఆ చానళ్లను ప్రజలు కోరుకోవడం లేదు
తెలంగాణ ఎంఎస్‌ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్‌రెడ్డి
సూర్యాపేట: టీవీ9, ఏబీఎన్ ప్రసారాలను ప్రజలు ప్రసారం చేయాలని కోరుకోవడం లేదని, వారు కోరుకుంటే ప్రసారం చేస్తామని తెలంగాణ ఎంఎస్‌ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్‌రెడ్డి తెలిపారు. సోమవారం నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణ సమీపంలోని సీతారామ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన ఆ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ రెండు చానళ్ల ప్రసారాలను నిలిపివేయడంలో ప్రభుత్వ పాత్ర, ఎంఎస్‌ఓల పాత్ర ఏమీ లేదన్నారు.
వ్యాపార ఒప్పందాలు కొనసాగించే ఆలోచన ఆ రెండు యాజమాన్యాలకు లేదని చెప్పారు. ఉన్నత న్యాయస్థానాలు సైతం ఎంఎస్‌ఓలకు అనుకూలంగానే తీర్పు చెప్పాయని గుర్తు చేశారు. ఎంఎస్‌ఓలందరూ సమస్యల పట్ల సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అందరూ కలిసికట్టుగా సమస్యల పరిష్కారానికి కృషి చేసినప్పుడే హక్కులను సాధించుకోగలుగుతామని తెలిపారు.