కరెంటు కష్టాలకు ఇక చెల్లు | Check the current woes | Sakshi
Sakshi News home page

కరెంటు కష్టాలకు ఇక చెల్లు

Published Wed, Jan 28 2015 9:26 AM | Last Updated on Sat, Sep 2 2017 8:25 PM

Check the current woes

మెదక్ జిల్లాలో లో ఓల్టేజీ సమస్యను నియంత్రించి, నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తోందని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. మంగళవారం స్థానిక విద్యుత్ డీఈ కార్యాలయ ప్రాంగణంలో రూ. 1.72 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ సబ్ స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సిద్దిపేట సబ్ స్టేషన్‌ను నాలుగు నెలల్లోనే నిర్మించడం అభినందనీయమన్నారు. జిల్లాకు కేంద్రం రూ. 82 కోట్లను మంజూరు చేసిందని, ఆ నిధుల్లో సిద్దిపేటకు రూ. 6 కోట్లు మంజూరయ్యాయన్నారు. వీటి ద్వారా నూతన లైన్ల నిర్మాణం, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు తదితర విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మార్చి 31 లోగా ఈ నిధులను వినియోగించుకోవాలని, లేకపోతే నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందన్నారు.

సిద్దిపేట నియోజకవర్గంలో విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని, అందులో భాగంగానే రంగధాంపల్లి, పుల్లూరు, చౌడారంలో 33/11 కేవీ సబ్ స్టేషన్‌లు మరో మూడు నెలలో పూర్తి కానున్నాయన్నారు.  చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌లో రూ. 25 కోట్లతో 133 కేవీ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 34 సబ్‌స్టేషన్‌ల పనులు ప్రారంభంలో ఉన్నాయని, మరో 30 సబ్‌స్టేషన్‌ల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. భవిష్యత్‌లో జిల్లాకు విద్యుత్ సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఈ సదాశివరెడ్డి, డీఈ శ్రీనివాస్‌రెడ్డి, ఏడీఈ ప్రశాంత్, ఏఈలు రమేష్, వెంకటేష్, శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.
 
సేవాభావంతో వైద్యం చేయాలి
సిద్దిపేట పట్టణంలో కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి రావడం అభినందనీయమని, అయితే తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తెచ్చేలా కార్పొరేట్ ఆస్పత్రులు పని చేయాలని మంత్రి హరీష్‌రావు కోరారు. మంగళవారం మంత్రి పట్టణంలో సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల, సురక్ష ఆస్పత్రిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిద్దిపేటలో హైదరాబాద్ తరహాలో సురక్ష ఆస్పత్రి ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. ప్రాణాపాయ స్థితిలో హైదరాబాద్‌కు పరుగులు తీసే బాధ లేకుండా స్థానికంగా కార్పొరేట్ వైద్యంతో కూడిన ఆస్పత్రిని ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు భూపాల్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి,  జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement