
'ఆ పేలుడుకు కారణం రసాయనాలే'
కరీంనగర్: కరీంనగర్ ప్రభుత్వాస్పత్రి సమీపంలో ఒక చెత్తకుండీ వద్ద పేలుడుకు గల కారణాన్ని పోలీసులు నిర్ధారించారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి వచ్చిన నివేదికతో ఈ విషయం నిర్ధారణ అయింది. విగ్రహాల తయారీకి ఉపయోగపడే ప్లాస్టో పారిస్ రసాయనాల కలయికే కారణమని ఎస్పీ జోయల్ డేవిస్ గురువారం మీడియాకు వెల్లడించారు. ఈ పేలుడుకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. టూటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు ఎస్పీ జోయల్ తెలిపారు.
కరీంనగర్ ప్రభుత్వాస్పత్రి సమీపంలో ఒక చెత్తకుండీ వద్ద పేలుడు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. పేలుడు ధాటికి ఒక ప్లాస్టిక్ టిన్ను తునాతునకలైపోయింది. దాన్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపిన సంగతి తెలిసిందే. ఈ పేలుడు ఘటనలో అక్కడ చెత్త ఏరుకునే దుర్గయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడి తలకు, చేతులకు గాయాలయ్యాయి. పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.