న్యూఢిల్లీ: ఢిల్లీ నడిబొడ్డున ఉన్న ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ఎదుట శుక్రవారం సాయంత్రం ఐఈడీ పేలుడు సంభవించింది. హై సెక్యూరిటీ జోన్‌లోని ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులో సంభవించిన ఈ ఘటనలో ఎవ్వరూ గాయపడలేదు. సాయంత్రం 5 గంటల సమయంలో దౌత్య కార్యాలయం సమీపంలోని ఓ పూలకుండీలో ఉంచిన ఐఈడీ పేలింది. దాని తీవ్రతకు దగ్గర్లో పార్కు చేసిన మూడు కార్ల అద్దాలు మాత్రం పగిలిపోయాయని పోలీసులు తెలిపారు. సంచలనాన్ని సృష్టించేందుకు చేసిన ప్రయత్నమని అధికారులు భావిస్తున్నారు.
ఈ ఘటనలో ఎటువంటి ఆస్తినష్టం వాటిల్లలేదు. అయితే, అదే సమయంలో కొద్ది కిలోమీటర్ల దూరంలో రాజ్‌పథ్‌లో రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ తదితరులు రాజ్‌పథ్‌లో గణతంత్ర వేడుకల ముగింపు ఉత్సవాల్లో పాల్గొనడం గమనార్హం. ఘటన నేపథ్యంలో విదేశాంగ మంత్రి జై శంకర్ ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గబి అష్కెనాజీతో ఫోన్‌లో మాట్లాడారు. ఇజ్రాయెల్ దౌత్య సిబ్బందికి పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామనీ, బాధ్యులను వదిలిపెట్టబోమని ప్రభుత్వం ట్విట్టర్‌లో తెలిపింది. విమానాశ్రయాలు, ఢిల్లీ మెట్రోతోపాటు ముఖ్యమైన, కీలక ప్రభుత్వ విభాగాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని సీఐఎస్‌ఎఫ్‌కు ఆదేశాలు అందాయి.
Comments
Please login to add a commentAdd a comment