కాలుష్యం తగ్గిద్దాం.. మరింత కాలం జీవిద్దాం!
- సగటున నాలుగేళ్లు పెరగనున్న భారతీయుల జీవితకాలం
- వాయు కాలుష్యంపై డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలు పాటిస్తే చాలు
- ఎక్కువ లాభపడే నగరం దేశ రాజధాని ఢిల్లీనే
- ఢిల్లీలో సుమారు తొమ్మిదేళ్లు పెరగనున్న జీవితకాలం
- షికాగో వర్సిటీ ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్‌లో వెల్లడి
- వాయు కాలుష్యం కారణంగా దేశంలో మరణాల సంఖ్య
- ఆధారం: స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ రిపోర్ట్–2017
సాక్షి, తెలంగాణ డెస్క్ : వాయు కాలుష్యాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రమాణాల ప్రకారం తగ్గించినట్లయితే భారతీయుల జీవితకాలం సగటున మరో నాలుగేళ్లు పెరుగుతుందట. ఇటీవల విడుదల చేసిన ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్(ఏక్యూఎల్‌ఐ) ఈ విషయాన్ని వెల్లడించింది. అమెరికాలోని షికాగో యూనివర్సిటీకి చెందిన ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్ ఈ నివేదికను రూపొందించింది. డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలను భారత్ పాటించినట్లయితే ఎక్కువగా ప్రయోజనం పొందే నగరం దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీనే అట. ఇక్కడ ప్రజల జీవితకాలం సుమారు 9 సంవత్సరాలు పెరగనుందట. ఆ తర్వాత ఆగ్రాలో 8.1 సంవత్సరాలు.. బరేలీలో 7.8 సంవత్సరాలు జీవితకాలం పెరిగే అవకాశం ఉందట.
వాయు కాలుష్యానికి సంబంధించి డబ్ల్యూహెచ్‌వో లేదా జాతీయ ప్రమాణాలను అమలు చేస్తే ప్రజల జీవితకాలం ఎంత పెరుగుతుందనేది ఈ ఇండెక్స్ ద్వారా అంచనా వేసింది ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్ధేశించిన ప్రకారం పీఎం 2.5ను నియంత్రించగలిగితే భారతీయుల జీవిత కాలం సగటున 1.35 సంవత్సరాలు పెరుగుతుందని ఏక్యూఎల్‌ఐ అంచనా వేసింది. కాగా, 2015 ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం భారతీయుల సగటు జీవితకాలం 68.35 సంవత్సరాలు.
పీఎం 2.5అంటే..?
గాలిలో కలసిపోయి తలవెంట్రుక కంటే 30 రెట్లు చిన్నగా లేదా 2.5 మైక్రాన్ల సైజులో ఉండే నలుసు పదార్థమే పర్టిక్యూలేట్ మ్యాటర్–పీఎం 2.5. దీనిని పీల్చడం వల్ల శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలు తీవ్రమవుతున్నాయి. డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాల ప్రకారం గాలిలో పీఎం 2.5ను వార్షికంగా అనుమతించే స్థాయి ప్రతి క్యూబిక్ మీటర్‌కు 10 మైక్రో గ్రాములు. అదే భారతదేశ జాతీయ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్ ప్రకారం పీఎం 2.5ను అనుమతించేది 40 మైక్రో గ్రాములే. ఢిల్లీలో పీఎం 2.5 ఒక క్యూబిక్ మీటర్‌కు 98 మైక్రో గ్రాములు ఉందంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఢిల్లీలో పీఎం 2.5 స్థాయి జాతీయ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్ కంటే రెంట్టింపు.. డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలకు పది రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. ఢిల్లీలో పీఎం 2.5ను డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాల ప్రకారం నియంత్రించగలిగితే అక్కడి ప్రజల జీవితకాలం సుమారు 9 సంవత్సరాలు పెరుగుతుంది. అదే జాతీయ ప్రమాణాల ప్రకారం నియంత్రించడగలిగితే సుమారు 6 సంవత్సరాలు పెరిగే అవకాశం ఉంది. భారత్‌లో ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్ ఇంత తక్కువగా ఉండటం వల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, అందువల్లే డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలను పాటించాలని ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ మైఖేల్ గ్రీన్‌స్టోన్ చెపుతున్నారు.