సీఎంకు ప్రతిపక్ష పార్టీలంటే చులకన
► స్థాయి తెలుసుకొని మాట్లాడాలిజల కోసం నిలదీస్తాం
► బీజేపీ తూర్పు జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల మల్లారెడ్డి
మంచిర్యాలసిటీ : రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రతిపక్ష పార్టీలంటే గౌరవం లేకుండా పోయి, చులకనబావం ఏర్పడిందని బీజేపీ తూర్పు జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల మల్లారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మంచిర్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజల సమస్యలపై తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రభుత్వాన్ని నిలదీస్తే, రాష్ట్ర సీఎం అసభ్యపదాలను వాడుతూ దూషించడం సరికాదన్నారు. ప్రతి పక్ష పార్టీల నాయకులను సీఎం విమర్శించే ముందు వారి స్థాయి తెలుసుకొని మాట్లాడాలని హితలు పలికారు. ప్రజల సమస్యల కోసం ప్రభుత్వానికి భయపడకుండా, ప్రభుత్వం పెట్టే కేసులు, పరువునష్టం దావాలకు జంకకుండా తప్పనిసరిగా నిలదీస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, ప్రజల సమస్యలను పక్కకుపెట్టి, అభివృద్ధిని గాలికి వదలేసి కేవలం తన కుటుంబం, పార్టీ అభివృద్ధి కోసం సీఎం పాటుపడుతున్నారని ఆరోపించారు.
కరువు కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.792 కోట్లతోపాటు 52 కోట్ల ఖర్చుపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వద్దకు నిధుల కోసం వెళ్లినపుడు ఒకమాట, రాష్ట్రంలో ఒక మాట మాట్లాడుతూ బీజేపీ నాయకులను విమర్శించే విధానాన్ని మానుకోవాలన్నారు. కేంద్రం సహాకారం లేనిదే రాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ పథకం ముందుకు సాగదనే విషయాన్ని సీఎంతోపాటు అధికార పార్టీ మంత్రులు, ప్రజాప్రతినిధులు గమనించాలన్నారు. సమావేశంలో మున్నారాజ్ సిసోధ్య, లింగన్నపేట విజయ్‌కుమార్, శశి, అశోక్‌వర్ధన్ ఉన్నారు.