
వ్యాధిబారిన పడిన పూజ, కిశోర్
మాగనూర్ (మక్తల్) : మండల కేంద్రంలో చికెన్‌గున్యా వ్యాధితో తీవ్ర అనారోగ్యానికి గురై ప్రజలు మంచానపడ్డారు. ఈ వ్యాధికి గురైన పిల్లలు, వృద్ధుల పరిస్థితిని చూడలేకపోతున్నారు. వ్యాధిగ్రస్తులు పూర్తిగా నడవలేకపోవడంతోపాటు కీళ్లు పట్టేస్తుండడంతో ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు ఉన్న సమయంలో ఈ వ్యాధి సోకడంతో రైతులు, రైతు కూలీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రికి వెళ్లి రూ.వేలు ఖర్చు చేస్తున్నా వ్యాధి నయం కావడం లేదు.
ఇటు చేతిలో ఉన్న డబ్బులు అయిపోయి.. అటు వ్యవసాయ పనులు నిలిచిపోతుండడంతో తీవ్ర మానసిక ఆందోళనకు లోనవుతున్నారు. గత వారం రోజులుగా ఈ వ్యాధి గ్రామంలో అంతటా విజృంభిస్తుండటంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. గ్రామంలో మురుగు కాల్వల్లో నీరు నిల్వ ఉండడంతోపాటు అపరిశుభ్రత కారణంగా దోమ లు విపరీతంగా పెరుగుతున్నాయని, ఈ దోమల కాటు మూలంగానే వ్యాధి వ్యాపిస్తోందని వాపోతున్నారు. వారం పది రోజులుగా ప్రజలు మంచం పట్టినా ఇటు వైద్యశాఖ గాని.. అటు పంచాయతీ పాలకులు గాని ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శిబిరం ఏర్పాటు చేయాలి
గ్రామంలో ఈ వ్యాధి తీవ్రస్థాయిలో ఉండడం మూలంగా ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించాలి. అలాగే ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న సిబ్బంది కూడా ఈ విషయమై పెద్దగా స్పందించడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలి.
– సత్యమ్మ, బాధితురాలు
Comments
Please login to add a commentAdd a comment