అనాథ.. అమ్మ అయింది! | Child Orphanage In Warangal | Sakshi
Sakshi News home page

అనాథ.. అమ్మ అయింది!

Published Fri, May 3 2019 11:48 AM | Last Updated on Fri, May 3 2019 11:48 AM

Child Orphanage In Warangal - Sakshi

రజినికి బిడ్డను చూపిస్తున్న దృశ్యం, (ఇన్‌సెట్‌)లో పాపతో శ్రీదేవి

నర్సంపేట: సొంత మనుషులు పట్టించుకోలేదు.. మతిస్థిమితం తప్పడంతో బస్టాండ్‌లో ఆవాసం ఏర్పర్చుకున్న యువతి గర్రెపల్లి రజినిపై ఓ కామాంధుడు కన్నేశాడు.. ఫలితంగా అభంశుభం తెలియని ఆమె గర్భం దాల్చింది. ఆరు నెలల గర్భంతో సరైన పోషణ, చికిత్స లేక అనారోగ్యం పాలైన ఆ యువతి దీనగాథను నాలుగు నెలల క్రితం ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో స్పందించిన కాజీపేటలోని అమ్మ అనాథశ్రమం నిర్వాహకులు డాక్టర్‌ శ్రీదేవి ఆమెను చేరదీసి అన్నీ తానై చూసుకుంది. సాధారణ మహిళల్లాగే ఆశ్రమంలోనే సీమంతం జరిపించింది. ప్రస్తుతం నెలలు నిండిన రజినిని గురువారం హన్మకొండలోని ప్రసూతి ఆస్పత్రిలో చేర్పించగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆశ్రమంలో ఉన్న సమయాన కొద్దిగా ఆరోగ్యం బాగుపడిన రజిని.. తనకు పుట్టిన బిడ్డను చూసి మురిసిపోయింది. తన గాధను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురాకున్నా.. అమ్మ ఆశ్రమం ఒడిలో చేర్చుకోకున్నా ఏమై పోయోదాన్నోనని ఆమె కంట తడి పెట్టుకుంది.

మతిస్థిమితం లేకపోవడంతో...
దుగ్గొండి మండలం రేబల్లె గ్రామానికి చెందిన గర్రెపల్లి రజిని. కొంత మతిస్థిమితం తప్పడంతో బస్టాండ్‌ సెంటర్లలో ప్రయాణికులను చిల్లర అడుక్కుంటూ., నర్సంపేట బస్టాండ్‌లోనే కాలం గడిపేది. ఆ సమయంలో ఓ కామాంధుడు చేసిన పాపానికి రజిని అమ్మ అయింది. ఆరు నెలల గర్భిణిగా ఉండి తనకేం జరిగిందో తెలియక.. సరైన చికిత్స అందక అనారోగ్యం పాలయిన అమె దీనగాధను గత జనవరి 20న ‘అనాధను అమ్మ చేశారు’ శీర్షికన ‘సాక్షి’ ప్రచురితమైంది.

దీంతో స్పందించిన జిల్లా కలెక్టర్‌ హరిత.. రజినిని చేరదీయాలని ఐసీడీఎస్‌ అధికారులను ఆదేశించారు,. అయితే, ఐసీడీఎస్‌ అధికారుల సమక్షాన కాజీపేటలోని అమ్మ అనాథాశ్రమం నిర్వాహకురాలు అమ్మ శ్రీదేవి ఆమె బాధ్యత స్వీకరించారు. ఇక ఏప్రిల్‌ 3న ఆశ్రమంలోనే సీమంతం కూడా జరిపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వైద్యపరీక్షలు చేయిస్తూ బిడ్డలా సాకారు. ఈ మేరకు గురువారం ఉదయం రజినికి పురిటి నొప్పులు రాగా.. హన్మకొండలోని జీఎంహెచ్‌లో చేర్పించారు. అక్కడ  సూపరింటెండెంట్‌ సరళాదేవి నేతృత్వాన వైద్యులు, సిబ్బందికి రజినికి ప్రసవం చేయగా మగ బిడ్డ జన్మించాడు. కాగా, ఆ బాబు కొద్దిమేర అవస్థతకు గురవడంతో పిల్లల వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 

కంటికి రెప్పలా కాపాడాం...
కామాంధుల వంచనకు గురై అందరూ ఉన్నా అనాథగా మారిన రజిని విషయమై ‘సాక్షి’లో వచ్చిన కథనంతో చలించిపోయి వెంట తెచ్చుకున్నాను. గత ఐదు నెలలుగా  రజినిని కంటికి రెప్పలా కాపాడుకున్నాను. ఇప్పుడు ఆమె బాబుకు జన్మనివ్వడం.. ఇద్దరూ ఆరోగ్యంగా ఉండడం సంతోషాన్ని కలిగించింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయగానే బాబు, తల్లిని జిల్లా కలెక్టర్‌ సమక్షంలో ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగిస్తాను. – అమ్మ శ్రీదేవి, అమ్మ అనాథశ్రమం నిర్వాహకురాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement