సీఎం కేసీఆర్ తో చైనా కంపెనీ భేటీ
అంబేడ్కర్ విగ్రహ నిర్మాణంపై చర్చలు
సాక్షి, హైదరాబాద్: అత్యంత ఎత్తులో నిర్మించతలపెట్టిన బీఆర్ అంబేడ్కర్ విగ్రహ స్థాపనకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. చైనా ప్రభుత్వ నిర్మాణ రంగ సంస్థ ప్రతినిధులు బుధవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో అధికారిక నివాసంలో విగ్రహ నిర్మాణంపై చర్చలు జరిపారు. గతంలో తాము చైనాలో నిర్మించిన ప్రతిష్టాత్మక కట్టడాల వివరాలను కేసీఆర్‌కు వివరించారు. 125 అడుగుల భారీ విగ్రహ ప్రతిష్టాపనకు కావాల్సిన డిజైన్, ఆర్కిటెక్ట్ తదితర సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నిర్మాణ సమయంపై వారితో సీఎం చర్చించారు.
ఖర్చుకు వెనుకాడకుండా ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన విగ్రహ ప్రతిష్టాపనకు త్వరలో కమిటీ సభ్యులు చైనా సందర్శించి అక్కడి నిర్మాణాల తీరును పరిశీలించాక ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు సీఎం కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. కార్యక్రమంలో మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మిషన్ భగీరథ ఉపాధ్యక్షుడు వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, సీఎం ఆదేశాల మేరకు చైనా ప్రతినిధులను ఎంపీ బాల్క సుమన్ ట్యాంక్ బండ్ వద్దకు తీసుకెళ్లి అక్కడున్న అంబేడ్కర్ విగ్రహం నమూనా, ప్రతిష్టాపన స్థలాన్ని చూపించారు.