పతాక స్థాయికి ఉత్సవాలు
- నేటితో తెలంగాణ అవతరణ వేడుకల ముగింపు
- పీపుల్స్‌ప్లాజా నుంచి ట్యాంక్‌బండ్‌కు భారీ ర్యాలీ
- హాజరవుతున్న గవర్నర్, సీఎం
- వివిధ కళారూపాల ప్రదర్శన
సాక్షి,సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల ముగింపునకు నగ రం సిద్ధమవుతోంది. భారీ స్థాయిలో ఈ వేడుకల నిర్వహణకు యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఆదివారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై ఉత్సవాలు నిర్వహించనున్నారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ సహా ప్రముఖులంతా హాజరుకానున్నారు. పీపుల్స్ ప్లాజా నుంచి ట్యాంక్‌బండ్ వరకు లక్ష మందితో భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్లు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. ముగింపు వేడుకలకు వేలాదిగా తరలి రావాలని, బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
మరోవైపు తెలంగాణ సాంస్కృతిక, కళా వైభవాన్ని చాటేలా వివిధ కళా రూపాలను ట్యాంక్‌బండ్‌పై ప్రదర్శించనున్నారు. సుమారు 5 వేల మంది కళాకారులు వీటిలో పాల్గొంటారు. ధూంధాం, ఆట, పాటలు, బతుకమ్మలు, బోనాలతో సాయంత్రం 4 గంటల నుంచే ట్యాంక్‌బండ్‌పై సందడి నెలకొననుంది. రాత్రి 8 గంటలకు అవతరణ ఉత్సవాల ముగింపు సభ నిర్వహించనున్నారు.
ప్రజలకు ఇబ్బందులు లేకుండా...
తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం ట్యాంక్‌బండ్‌పై జరిగే భారీ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. ట్యాంక్‌బండ్, పరిసర ప్రాంతాల్లో 50 పబ్లిక్ టాయ్‌లెట్లు ఏర్పాటు చేయడంతో పాటు రోడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడానికి 500 మంది సఫాయి కార్మికులను విధుల్లో నియమిస్తున్నారు. అవతరణోత్సవాల ప్రారంభోత్సవంలో పరేడ్‌గ్రౌండ్‌లో ప్రదర్శించిన భారీ చీపురు శకటాన్ని తిరిగి ట్యాంక్‌బండ్‌పై ప్రదర్శనలో ఉంచనున్నారు. క్రీడాకారులతో ర్యాలీ, కాగడాల ప్రదర్శన తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. స్వయం సహాయక మహిళలు ఉత్సవాల్లో పాల్గొనేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.