
కాజీపేట: అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారిని కలుసుకోవడానికి సీఎం కేసీఆర్ సుముఖత వ్యక్తం చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట పట్టణానికి చెందిన కొక్కొండ విగ్నేశ్ (11) జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. విగ్నేశ్ తల్లి సరిత కుటుంబంలో అంతుచిక్కని ఈ వ్యాధి కొన్ని తరాలుగా వస్తోంది. 2007లో జన్మించిన విగ్నేశ్‌కు ఈ వ్యాధి సోకింది. మూడేళ్ల వయస్సు వరకు ఇంట్లో చలాకీగా తిరుగాడిన విగ్నేశ్‌లో మెల్లమెల్లగా వ్యాధి లక్షణాలు పొడచూపాయి. లక్షలాది రూపాయలను ఖర్చు చేసి వైద్యులకు చూపించారు. డుచ్చేనే మోస్కులర్ డిస్ట్రోపీ అనే వ్యాధి ఉందని ధ్రువీకరించారు.
ఇదీ జన్యుపరమైన లోపమని, దీనికి వైద్య చికిత్స ఇంత వరకు లేదని డాక్టర్లు తేల్చి చెప్పేశారు. దీంతో విగ్నేశ్ ఇంటికే పరిమితమయ్యాడు. ఏడాదికి మించి బాలుడు బతుకలేడని వైద్యులు సూచించినట్లుగా కుటుంబ సభ్యులు కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు.
సీపీఐ నారాయణ, స్పీకర్, ఎమ్మెల్యే చొరవ
టీవీల్లో తరచుగా కనిపిస్తున్న సీఎం కేసీఆర్ తాతను చూడాలని విగ్నేశ్ మారాం చేస్తుండేవాడు. ఈ విషయాన్ని బంధువుల ద్వారా తెలుసుకున్న స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి చిలువేరు శంకర్.. సీపీఐ నాయకుడు నారాయణ దృష్టికి తీసుకెళ్లారు. విగ్నేశ్‌ను పరామర్శించి సీఎం కేసీఆర్ దృష్టికి చిన్నారి మనస్సులోని కోరికను తీసుకెళ్లారు. స్పీకర్ మధుసూదనాచారితోపాటు ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ సీఎం క్యాంపు కార్యాలయానికి విషయాన్ని తీసుకెళ్లారు. ఈనెల 17వ తేదీన విగ్నేశ్‌ను హైదరాబాద్ ప్రగతిభవన్‌కు తీసుకురావాలని సీఎం సూచించారు. తమ బాబు చివరి కోరికను తీర్చడానికి ఒప్పుకున్న కేసీఆర్‌కు కన్నవాళ్లు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment