
యాదగిరీశుడికి కేసీఆర్ పట్టువస్త్రాలు
నల్గొండ: యాదగిరిగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన శ్రీలక్ష్మీనరసింహా స్వామి కల్యాణోత్సవంలో శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సతీసమేతంగా పాల్గొన్నారు. అనంతరం ఆయన స్వామి వారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. కేసీఆర్ ఈరోజు ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి యాదగిరి గుట్టకు వెళ్ళారు. మరోవైపు కేసీఆర్ అధ్యక్షుడుగా యాదగిరిగుట్ట డెవలప్ మెంట్ బోర్డు ఏర్పాటు అయింది.
కాగా యాదగిరిగుట్టలో సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశ్వర్లు ను గుట్టపైకి పోలీసులు అనుమతించలేదు. అదేవిధంగా భక్తులెవరినీ గుట్టపైకి అనుమతించపోవడంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.