మహతి ఆడిటోరియంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్
‘‘నేను వేరే ప్రాంతానికి వెళ్లి గొప్పలు చెప్పడం కాదు.. ముందుగా నా నియోజకవర్గాన్ని మోడల్‌గా తయారు చేయాలి. అప్పుడే మనం చెప్పిన మాటలు వింటారు.’’-సీఎం కేసీఆర్
సాక్షి, సిద్దిపేట(గజ్వేల్) : ప్రతీ కుంటుంబానికి అభివృద్ధి ఫలాలు అందితేనే మోడల్ గజ్వేల్‌గా తయారవుతుందని, ఇందుకోసం ‘ఎక్స్‌రే ఆఫ్ గజ్వేల్’ కార్యక్రమం నిర్వహించాలని అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. బుధవారం గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు ప్రాంతంలో నిర్మించిన అటవీ కళాశాల, పరిశోధనా కేంద్రం, కొండాలక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయం భవనాలు ప్రారంభించి, పైలాన్ ఆవిష్కరించారు. తర్వాత కొండాలక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించి సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్సీ ఫ్రూట్స్‌ను పరిశీలించారు. అనంతరం గజ్వేల్ పట్టణంలోని సమీకృత ప్రభుత్వ కార్యాలయం, సమీకృత మార్కెట్, మహతి ఆడిటోరియం భవనాలను ప్రారంభించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వంద పడకల మాతాశిశుసంరక్షణ ఆసుపత్రి భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మహతి ఆడిటోరియంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. ‘ఎక్స్‌రే ఆఫ్ గజ్వేల్’లో భాగంగా ప్రతీ ఇంటికి వెళ్లి వారి విద్యార్హతలు, వారు చేస్తున్న పని, వారికి అందించాల్సిన ఉపాధి, ఇలా అన్ని విషయాలు సేకరించాలని అన్నారు. దీంతో ఎక్కడ నరకాలి, ఎక్కడ అతకాలి అనే స్పష్టత వస్తుందని చెప్పారు. అప్పుడు పాడిపశువులు అందించడమా.. పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇప్పించడమా. ఇతర ఉపాధి అవకాశాలు ఏలా కల్పించాలి అనేది అర్థం అవుతుందన్నారు. అదేవిధంగా ఇల్లులేని కుటుంబం ఉండరాదని, ఇల్లు అవసరమైన వారందరికీ డబుల్ బెడ్‌రూం కట్టిస్తామని చెప్పారు. సంక్షేమ ఫలాలు అందించడంలో రాజకీయాలకు తావులేదని, ఎన్నికల వరకే రాజకీయాలని సీఎం చెప్పారు. ఈ పనులు సర్పంచ్, ఎంపీటీసీలు బాధ్యత తీసుకోవాలని అన్నారు.
పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా 30 రోజుల ప్రణాళిక పనులు సమర్థవంతంగా నిర్వహించారన్నారు. కంటి వెలుగు కార్యక్రమం మాదిరిగానే గజ్వేల్ నియోజకవర్గం ఆరోగ్య రికార్డును తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం కలెక్టర్, ఆర్డీఓ, మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రతీ ఒక్కరిని పరీక్షించాలని, ఎవరికీ ఏ విధమైన ఇబ్బంది ఉంది. వారి ఆరోగ్య పరిస్థితి, బ్లడ్‌గ్రూప్ ఇలా ప్రతీ అంశం క్షుణ్ణంగా పరీక్షించి రికార్డు రూపంలో పొందుపరుచాలన్నారు. ఇలా చేస్తే ఎవ్వరికి ఏ ఆరోగ్య సమస్య వచి్చనా వెంటనే చికిత్స అందించే అవకాశం ఉంటుందన్నారు. దీనికోసం గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. నాయకుడు పొగడ్తలకు తబ్బుబ్బి పోవద్దని సీఎం చెప్పారు.
ఒక పని పూర్తికాగానే మరొక పని మొదలవుతుందన్నారు. అందరికీ తాగునీరు అందించాలని తపించామని ఆ పని 99 శాతం పూర్తి చేశామన్నారు. కరెంట్ కష్టాలు తొలిగిపోయాయని, ఇక ముందు ఇబ్బందు ఉండదన్నారు. అభివృద్ధికోసం తపన ఉండాలని చెప్పారు. ప్రతీ అంశాన్ని పరిశీలించి ప్రజలకే ఎలా సేవ చేయకలిగితే అలా ప్రణాళిక తయారు చేసుకోవాలన్నారు. గతంలో సిద్దిపేట నియోజకవర్గలోని రామునిపట్ల గ్రామం అభివృద్ధి చేశామని, స్వయం ఉపాధి, స్వయం రూరల్, స్వయం ప్రణాళిక చేసి చూపించి సంపద సృష్టించామని సీఎం గుర్తు చేశారు. ఎర్రవల్లి గ్రామాన్ని కూడా అన్నిరంగాల్లో అభివృద్ధి చేశామని, నియోజకవర్గంలోని ప్రతీ గ్రామ మరో ఎర్రవల్లి కావాలని అన్నారు.
కొద్దిరోజుల్లో అందరితో మళ్లీ సమావేశం..
పని ఒత్తిడి మూలంగా మీతో సరైన సమయం గడపలేక పోతున్నాం. మరికొద్దిరోజుల్లో అందరితో కలిసి సమావేశం ఏర్పాటు చేస్తానని సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులకు చెప్పారు. అప్పుడు తీరికగా మాట్లాడుకోవచ్చని, మీ సలహాలు, సూచనలు తీసుకోని అభివృద్ధిని మరింత పరుగులుపెట్టించవచ్చన్నారు. గతంలో మాదిరిగా సభలు, సమావేశాలు పెట్టుకునేందుకు ప్రదేశం వెతకాల్సిన అవసరం లేదని అన్నారు. మహతి, ఎడ్యూకేషన్ హబ్, గడా కార్యాలయంలో ఆడిటోరియాలున్నాయన్నారు. స్వతంత్ర, గణతంత్ర, ఇతర ప్రత్యేక దినాల్లో ప్రజలు, ప్రజాప్రతినిదులు, అధికారులు ఎట్‌హోం వంటి కార్యక్రమాలు పెట్టుకొని కుటుంబాలతో ఆనందంగా గడపాలని సూచించారు.
అధికారుల కృషి అభినందనీయం
గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధిలో అధికారుల కృషి అభినందనీయం అని కేసీఆర్ అన్నారు. కలెక్టర్ వెంకట్రామిరెడ్డితోపాటు, రాత్రింబయళ్లు పనిచేసే అధికారులు జిల్లాలో ఉండటం సంతోషకరం అన్నారు. వారికి ప్రజాప్రతినిధుల సహకారం ఇచ్చారని చెప్పారు. గోదావరి జలాల రాకతో ఈ ప్రాంతం అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా మారబోతుందని చెప్పారు. హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్న మల్లన్న సాగర్ ప్రాంతాన్ని ఆహ్లాదరకమైన పర్యాటక కేంద్రంగా తయారు చేయాలన్నారు. దేశనలుమూలల నుండే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడికి వచ్చేలా చేయాలని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఈటెల రాజేందర్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, హౌసింగ్ కార్పొషన్ చైర్మన్ దామోదర్ గుప్త, ఎమ్మెల్సీలు బోడకుంట్ల వెంకటేశ్వర్‌రావు, కూర రఘోత్తంరెడ్డి, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రసమయి బాలకిషన్, ఒడితెల సతీ‹Ùకుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, పీసీసీఆర్ ఆర్ శోభ, ఎప్సీర్‌ఐ డీన్ చంద్రశేఖర్‌రెడ్డి, ఫారెస్టు కళాశాల డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి, సిద్దిపేట జెడ్పీచైర్‌పర్సన్ రోజాశర్మ, టీటీడీ డైరెక్టర్ మోరం శెట్టి రాములు, వివిధ శాఖలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment