21న తిరుమలకు ముఖ్యమంత్రి కేసీఆర్
• ప్రభుత్వం తరఫున ‘తెలంగాణ’ మొక్కుల సమర్పణ
• 22న దర్శనం.. శ్రీవారికి భారీ హారం
• రూ. 5 కోట్ల విలువైన ఆభరణాలు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: వేంకటేశ్వరునికి తెలంగాణ మొక్కులను తీర్చేందుకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 21న తిరుమలకు బయల్దేరనున్నారు. కుటుంబీకులు, కొందరు మంత్రులతో కలసి ప్రత్యేక విమానంలో మంగళవారం సాయంత్రం సీఎం తిరుపతి పర్యటనకు బయల్దేరుతారు. ఇప్పటికే ఖరారైన షెడ్యూలు ప్రకారం మంగళ వారం సాయంత్రం సీఎం తిరుపతి చేరుకుంటారు. కొండపైకి చేరుకొని రాత్రి తిరుమలలో బస చేస్తారు. 22న ఉదయాన్నే తిరుమలేశున్ని దర్శించుకుంటారు.
తెలంగాణ ప్రభుత్వం తరఫున దాదాపు రూ.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను శ్రీవారికి సీఎం సమర్పిస్తారు. తెలంగాణ ఉద్యమ సందర్భంగా మొక్కిన మొక్కులను తీర్చాలని రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల కిందటే నిర్ణయం తీసుకోవడం, వేంకటేశ్వర స్వామికి రూ.5 కోట్ల విలువైన ఆభరణాలను తయారు చేయించడం తెలిసిందే. రూ.3.7 కోట్ల విలువైన 14.2 కిలోల సాలగ్రామ హారం, రూ.1.21 కోట్ల విలువైన 4.65 కిలోల కంఠాభరణాన్ని చేయించింది. వీటి తయారీ బాధ్యతను ఏడాది క్రితమే టీటీడీకి అప్పగించింది. కోయంబత్తూరుకు చెందిన కీర్తిలాల్ జ్యువెలరీస్ వీటిని తయారు చేసింది.
వీటిని ప్రస్తుతం టీటీడీ ఖజానాలో భద్రపరిచారు. మొత్తం 18.85 కిలోల బరువున్న ఈ కానుకలను శ్రీవారికి సీఎం ముట్టజెప్పనున్నారు. అనంతరం తిరుపతి చేరుకొని అలివేలు మంగాపురంలో అమ్మవారిని దర్శించుకుని, బంగారు ముక్కుపుడక సమర్పించుకుంటారు. అనంతరం సీఎం హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు. 2010లో తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న సమయంలో టీఆర్‌ఎస్ అధినేత హోదాలో కేసీఆర్ తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర సాధన కల సాకారమైతే బంగారు కాసుల పేరు చేయిస్తానని మొక్కుకున్నారు.